
Sports News: శివ్‌లాల్‌కు ఆ అర్హతే లేదు: అజ్జూ
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: బీసీసీఐలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతినిధిగా ఉండేందుకు శివ్‌లాల్ యాదవ్‌కు అర్హత లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. అలాంటి వ్యక్తిని హెచ్‌సీఏ ప్రతినిధిగా బీసీసీఐ ఈ నెల 29న నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించాలని కార్యదర్శి విజయానంద్ కోరడం హాస్యాస్పదంగా ఉందని చెప్పాడు. ‘‘హెచ్‌సీఏ 85వ ఏజీఎమ్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం బీసీసీఐలో దాని ప్రతినిధిగా శివ్‌లాల్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు కార్యదర్శి పత్రిక ప్రకటనలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. క్రికెట్ వర్గాల్లో సీనియర్ అయిన శివ్‌లాల్‌పై ఉన్న గౌరవంతో ఇప్పటికే అతను హెచ్‌సీఏ అధికారిగా మొత్తం 17 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాడని స్పష్టం చేస్తున్నా. 1992 నుంచి 2000 వరకు సంయుక్త కార్యదర్శిగా, 2000 నుంచి 2008 వరకు కార్యదర్శిగా పని చేశాడు. హెచ్‌సీఏ వెబ్‌సైట్లో, ఉప్పల్‌లోని దాని కార్యాలయంలో ఈ సమాచారం ఉంది. నియమావళి ప్రకారం ఓ వ్యక్తి ఓ రాష్ట్ర క్రికెట్ సంఘంలో లేదా బీసీసీఐలో అధికార ప్రతినిధిగా మొత్తం 9 ఏళ్ల పాటు కొనసాగితే అతను బీసీసీఐ ప్రతినిధిగా ఉండేందుకు అర్హత కోల్పోతాడు. ఈ నిబంధన ప్రకారం శివ్‌లాల్ అనర్హుడు. అతని అర్హత విషయంతోనే నాకు సమస్య. ఆ బాధ్యత చేపట్టగలిగే ఎంతో మంది సమర్థులు మన చుట్టూ ఉన్నారు’’ అని శనివారం ఓ పత్రిక ప్రకటనలో అజహరుద్దీన్ పేర్కొన్నాడు. మరోవైపు సీఈవో ఎంపికలో పారదర్శకత పాటించకుండా ఇష్టమొచ్చిన రీతిలో అపెక్స్ కౌన్సిల్ పేరు చెప్పి సునీల్ కంటేను ఆ పదవిలో నియమించామనడం సరికాదని అజహరుద్దీన్ అన్నాడు. సీఈవో ఎంపిక ప్రక్రియపై విచారణ చేయాలని బీసీసీఐకి లేఖ రాస్తానని పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
Advertisement