Hyderabad vs Bangalore: హైదరాబాద్‌కు హసరంగ దెబ్బ.. బెంగళూరు సూపర్‌ విక్టరీ

హైదరాబాద్‌, బెంగళూరు జట్లు మరికాసేపట్లో కీలక పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు....

Updated : 08 May 2022 19:36 IST

ముంబయి: బెంగళూరు అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. 67 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై బెంగళూరు ఘన విజయం సాధించి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 192/6 స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు బౌలర్‌ హసరంగ (5/18) విజృంభించడంతో హైదరాబాద్‌ 125 పరుగులకే పరిమితమైంది. రాహుల్ త్రిపాఠి (58), మార్‌క్రమ్‌ (21), పూరన్ (19) మినహా ఎవరూ రెండంకెల స్కోరును నమోదు చేయలేదు. హసరంగతోపాటు హేజిల్‌వుడ్ 2.. హర్షల్‌ పటేల్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీశారు. హైదరాబాద్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను మరింత మెరుగుపర్చుకోగా.. ఓటమిబాటలో కొనసాగుతున్న హైదరాబాద్‌ అవకాశాలను తగ్గించుకుంటోంది. తొలి రౌండ్‌లో హైదరాబాద్‌ చేతిలో ఘోర పరాభవానికి బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది.


స్వల్ప వ్యవధిలో వికెట్లు..

బెంగళూరు నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ తడబడుతోంది. ఈ క్రమంలోనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. నికోలస్‌ పూరన్‌ (19) పరుగుల వద్ద ఔటయ్యడు. హసరంగ వేసిన 13 ఓవర్‌లో తొలి బంతికి అతడు షాబాజ్ అహ్మద్‌కు చిక్కాడు. జగదీష్‌ సుచిత్ (2)ను కూడా హసరంగనే ఔట్‌ చేశాడు. 15వ ఓవర్‌లో అతడు స్టంపౌట్‌ అయ్యడు. మరోవైపు.. రాహుల్‌ త్రిపాఠి దూకుడుగా ఆడుతున్నాడు. షాబాజ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన త్రిపాఠి.. సిరాజ్ వేసిన 14 ఓవర్‌లో సిక్సర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు హైదరాబాద్ ఐదు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (57),శశాంక్‌ సింగ్‌ (6) క్రీజులో ఉన్నారు.


ఒకే ఓవర్‌లో ఓపెనర్ల వికెట్లను చేజార్చుకున్న హైదరాబాద్‌ కాస్త కోలుకుంది. రాహుల్ త్రిపాఠి (30*), మార్‌క్రమ్ (21) క్రీజ్‌లో కుదురుకుని పరుగులు సాధించారు. అయితే హసరంగ వేసిన ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద కోహ్లీ చేతికి చిక్కాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ 8.2 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్‌లో త్రిపాఠితోపాటు పూరన్‌ ఉన్నాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ విజయానికి ఇంకా 70 బంతుల్లో 142 పరుగులు కావాలి. 


ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

హైదరాబాద్‌ లక్ష్య ఛేదనను ప్రారంభించింది. అయితే తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్‌ కేన్‌ విలియమ్సన్ (0), అభిషేక్‌ శర్మ (0) ఔటయ్యారు. పరుగు తీసే క్రమంలో కేన్‌ రనౌట్‌ కావడంతో  డైమండ్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు.  ఒక్క బంతి కూడా ఆడకుండా సున్నాకే ఔటైతే డైమండ్‌ డక్‌గా పేర్కొంటారు. బెంగళూరు బౌలర్‌ మ్యాక్స్‌వెల్‌ వేసిన ఓవర్‌లో అభిషేక్‌ (0) పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజ్‌లో త్రిపాఠి (3*), మార్‌క్రమ్‌ (12*) ఉన్నారు.


బెంగళూరు స్కోరు 192/3

కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌కు బెంగళూరు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు సారథి డుప్లెసిస్‌ (73*), రాజత్‌ పాటిదార్‌ (48), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్‌ కార్తిక్‌ (30*) ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (0) హైదరాబాద్‌పై మరోసారి గోల్డెన్‌ డక్‌గా  పెవిలియన్‌కు చేరాడు. ఫరూఖి వేసిన చివరి ఓవర్‌లో దినేశ్ కార్తిక్‌ 25 పరుగులను రాబట్టాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. బౌండరీ లైన్‌ వద్ద త్రిపాఠి క్యాచ్‌ మిస్‌ చేయడంతో వరుస బంతుల్లో కార్తిక్‌ మూడు సిక్సర్లతోపాటు ఫోర్ బాదడం విశేషం. హైదరాబాద్‌ బౌలర్లలో సుచిత్ 2, త్యాగి ఒక వికెట్ తీశారు. ఆఖరి ఐదు ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు 67 పరుగులను జోడించారు.


డుప్లెసిస్‌ హాఫ్ సెంచరీ

కెప్టెన్‌ డుప్లెసిస్‌ (55*) అర్ధ శతకం సాధించాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. క్రీజ్‌లో డుప్లెసిస్‌తోపాటు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (16*) ఉన్నాడు. అంతకుముందు రాజత్‌ పాటిదార్‌ (48) హాఫ్ సెంచరీకి రెండు పరుగుల తేడాతో కోల్పోయాడు. 


బెంగళూరు బ్యాటర్ల జోరు

బెంగళూరు బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. హైదరాబాద్‌ బౌలర్లు శ్రమిస్తున్నా వికెట్‌ మాత్రం దక్కడం లేదు.  ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజ్‌లో డుప్లెసిస్‌ (45*), రాజత్‌ పాటిదార్ (44*) ఉన్నారు. హైదరాబాద్‌ ఫీల్డర్ల వైఫల్యంతో రెండు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. 


ముగిసిన పవర్‌ప్లే

బెంగళూరు ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే ముగిసింది. సున్నాకే వికెట్‌ను కోల్పోయినప్పటికీ బెంగళూరు కోలుకుంది. వన్‌డౌన్‌లో వచ్చిన రాజత్ పాటిదార్‌ (23*) కాస్త దూకుడుగా ఆడుతుండగా.. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (20*) ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. అంతకుముందు హైదరాబాద్‌ స్పిన్నర్‌ సుచిత్‌ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.


కోహ్లీ మళ్లీ గోల్డెన్ డక్‌

హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జగదీష్‌ సుచిత్ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డకౌట్‌ అయ్యాడు. టీ20 లీగ్‌లో కోహ్లీ ఇప్పటివరకు ఆరుసార్లు గోల్డెన్ డకౌట్‌ కాగా.. ఇందులో మూడు ఈ సీజన్‌లోనే కావడం గమనార్హం. రెండుసార్లు హైదరాబాద్‌తోనే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రెండు ఓవర్లకు బెంగళూరు 4/1తో ఉంది. రాజత్ పాటిదార్‌ (2), డుప్లెసిస్ (1) క్రీజులో ఉన్నారు. 


టాస్‌ నెగ్గిన డుప్లెసిస్‌

హైదరాబాద్‌, బెంగళూరు జట్లు మరికాసేపట్లో కీలక పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మరోవైపు హైదరాబాద్‌ 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ముందుకు దూసుకుపోవాలని భావిస్తోంది.

హైదరాబాద్‌ జట్టు: అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, సుచిత్‌, కార్తిక్‌ త్యాగి, భువనేశ్వర్‌ కుమార్‌, ఫారూకీ, ఉమ్రాన్‌ మాలిక్‌

బెంగళూరు జట్టు: విరాట్‌ కోహ్లీ, ఫా డుప్లెసిస్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, వానిండు హసరంగ, హర్షల్‌ పటేల్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మహ్మద్‌ సిరాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని