Rohit Sharma: రోహిత్‌ తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యాడు: ఇయాన్‌ బిషప్

ముంబయి సారథి రోహిత్‌ శర్మ ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓటమిపాలై ఈ టీ20 లీగ్‌ చరిత్రలోనే ఎవరూ ఊహించని పేలవ రికార్డు నమోదు చేశాడు...

Published : 01 May 2022 01:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి సారథి రోహిత్‌ శర్మ ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓటమిపాలై ఈ టీ20 లీగ్‌ చరిత్రలోనే ఎవరూ ఊహించని పేలవ రికార్డు నమోదు చేశాడు. అయితే, గత మ్యాచ్‌లో ఆ జట్టు లఖ్‌నవూ చేతిలో ఓటమిపాలైన అనంతరం తాను రోహిత్‌తో మాట్లాడానని వెస్టిండీస్‌ దిగ్గజం ఇయాన్‌ బిషప్‌ పేర్కొన్నాడు. ఆ సమయంలో అతడు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైనట్లు కనిపించాడని తెలిపాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన బిషప్‌ ముంబయి జట్టుపై స్పందించాడు.

‘ముంబయి తన చివరి మ్యాచ్‌ లఖ్‌నవూతో ఓటమిపాలయ్యాక నేను రోహిత్‌తో మాట్లాడాను. అప్పుడు అతడు పూర్తి నిరాశతో ఉన్నాడనిపించింది. ముంబయి ఎంతో గొప్ప పేరున్న జట్టు. అయితే, ఆ జట్టులో ఇప్పుడు కొన్ని మార్పులు అవసరమని నేను భావిస్తున్నా. టిమ్‌డేవిడ్‌ లాంటి ఆటగాడిని వాళ్లు తుది జట్టులోకి తీసుకోవాలి. అతడికి ఎందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదో నాకు అర్థంకాలేదు. ఆ జట్టు బ్యాటింగ్‌ యూనిట్‌లో భారీ స్కోర్లు కావాలంటే టిమ్‌ లాంటి ఆటగాడిని ఎంచుకోవాలి. సూర్యకుమార్‌ బాగా ఆడుతున్నా టిమ్‌ కూడా ఉపయోగపడతాడు’ అని బిషప్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ముంబయి బౌలింగ్‌ యూనిట్‌ కూడా సరిగ్గా లేదని విండీస్‌ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో ధారాళంగా పరుగులిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ఈసారి బౌలింగ్‌ త్రయం కూడా బాగోలేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబయి మున్ముందు ఏయే ఆటగాడిని ఆడిస్తుందో చూడాలన్నాడు. అయితే, ఇకపై ఆడే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి గర్వంగా తల ఎత్తుకొని వెళ్లాలని కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని