ICC : పురుషులు, మహిళల ప్రైజ్‌మనీలో తేడాపై చర్చిస్తున్నాం: ఐసీసీ సీఈవో

ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో పురుషుల, మహిళల జట్లకు...

Updated : 03 Apr 2022 16:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో పురుషులు, మహిళల జట్లకు అందించే ప్రైజ్‌మనీలో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గెఫ్ అలార్డెస్‌ తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రపంచకప్‌లో విజేతకు 1.32 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ అందనుంది. ఇది 2019 పురుషుల వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌కు దక్కిన ప్రైజ్‌మనీలో (4.8 మిలియన్‌ డాలర్లు) మూడో వంతు కావడం గమనార్హం. ఈ క్రమంలో 2024-2032 వరకు జరిగే పురుషుల, మహిళల ఈవెంట్లకు సంబంధించి ప్రైజ్‌మనీని సమానంగా అందించేందుకు అపెక్స్ కమిటీ చర్చించిందని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు. 

‘‘ప్రైజ్‌మనీ అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నాం. అంతేకాకుండా మహిళల ప్రస్తుతం ఎనిమిది జట్లతో జరుగుతున్న ప్రపంచకప్‌లో మరో రెండింటిని చేర్చడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2029 నాటికి పది జట్లతో ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది మంది తల్లులు వరల్డ్‌ కప్‌ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పోటీతత్వం పెరగడం ఆహ్వానించదగిన విషయం. దీనికి తగ్గట్టుగా వారికి సదుపాయాలు కల్పించాం’’ అని గెఫ్ అలార్డెస్‌ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బిస్మా మరూఫ్‌, సాటార్త్‌వైట్ (కివీస్), లీ తహుహు (కివీస్‌), మెగన్‌ ష్కుట్‌ (ఆసీస్‌), రాచీల్‌ హైన్స్‌ (ఆసీస్‌), లీజెల్లె లీ  (దక్షిణాఫ్రికా), మసబాట క్లాస్‌ (దక్షిణాఫ్రికా), ఫ్లెచర్‌ (విండీస్‌) క్రికెటర్లు పిల్లలకు జన్మనిచ్చాక కూడా ప్రపంచ కప్‌లో ఆడటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని