IND vs PAK: వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌ - 2023.. మరోసారి ఒకే గ్రూప్‌లో దాయాదులు

ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేనప్పటికీ.. భారత్‌ X పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులకు అవకాశం వస్తూనే ఉంది. విజయం కోసం ఇరు జట్ల పోరాటం కూడా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి (ODI World Cup 2023) ముందే మరోసారి దాయాదుల పోరును వీక్షించొచ్చు.

Updated : 05 Jan 2023 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ - పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూసే అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా (Jay Shah) శుభవార్త తెలిపారు. గత టీ20 ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్‌లో పోటీ పడిన ఇరు జట్లూ మరోసారి తలపడేందుకు సిద్ధం కావడం విశేషం. అయితే, ఈసారి మాత్రం ఆసియా కప్‌లో (Asia Cup 2023) పోటీపడనుండటం విశేషం. ఈ మేరకు పురుషుల ఆసియా కప్‌ 2023, మహిళల ఆసియా కప్‌ 2024 గ్రూప్‌ల వివరాలను జై షా ప్రకటించారు. రెండేళ్లపాటు ఆసియా క్రికెట్‌ క్యాలెండర్‌, అండర్ -16, అండర్‌ - 19, ఎమర్జింగ్‌ టీమ్స్‌ (ఏ జట్లు), సీనియర్‌ పురుషులు, మహిళా జట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

‘‘ఆసియా క్రికెట్‌ 2023, 2024కి సంబంధించి ఏసీసీ క్రికెట్ క్యాలెండర్లను ప్రకటించాం. ఇక్కడ క్రికెట్‌ను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఆసియా దేశాల క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రికెట్‌ను ఎంజాయ్ చేయడానికి సరైన సమయంగా భావిస్తున్నాం’’ అని జైషా ట్వీట్ చేశారు. ఏసీసీ విడుదల చేసిన క్రికెట్‌ క్యాలెండర్‌ ప్రకారం.. 2023లో మెన్స్‌ ఆసియా కప్ (ODI)‌, 2024లో మహిళల ఆసియా కప్‌ (T20) జరుగుతాయి. 

(ఫొటో సోర్స్‌: ఏసీసీ ట్విటర్)

గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ పోటీలను ఈసారి మాత్రం వన్డే ఫార్మాట్‌లో ఏసీసీ నిర్వహించనుంది. పురుషుల ఆసియా కప్ 2023 (Asia Cup) సెప్టెంబర్‌ నెలలో ఉంటుంది. అయితే తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఆరు జట్లు తలపడే ఈ టోర్నీలో రెండు గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపులో భారత్‌, పాక్‌తోపాటు (IND vs PAK) క్వాలిఫయర్‌ జట్టు ఒకటి ఉంటుంది. మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇక మహిళల ఆసియా కప్‌ 2024లోనూ భారత్‌, పాక్‌ ఒకే గ్రూప్‌లో ఉంటాయి. అయితే టీ20 ఫార్మాట్‌లో ఈ పోటీలు జరుగుతాయి.

(ఫొటో సోర్స్‌: ఏసీసీ ట్విటర్)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని