Kohli - Rohit: పింక్‌బాల్‌ టెస్టులో కోహ్లీ-రోహిత్‌ ఎలా ఆడుతారో!

టీమ్‌ఇండియా శనివారం నుంచి శ్రీలంకతో ఆడే రెండో టెస్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది...

Published : 11 Mar 2022 12:25 IST

డే/నైట్‌ టెస్టుల్లో కోహ్లీనే టాప్‌ స్కోరర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా శనివారం నుంచి శ్రీలంకతో ఆడే రెండో టెస్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు భారత్‌ ఆడిన మూడు పింక్‌బాల్‌ టెస్టుల్లో కోహ్లీనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు ఆడిన మూడు డే/నైట్‌ టెస్టుల్లో 60.25 మెరుగైన సగటుతో 241 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో అందరికన్నా ముందున్నాడు. తర్వాత రోహిత్‌ రెండు టెస్టుల్లో 112 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ప్రారంభమయ్యే మరో పింక్‌బాల్‌ టెస్టులో వీరిద్దరు ఎలా ఆడతారనేది కీలకం కానుంది.

కాగా, పింక్‌బాల్‌ టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున కోహ్లీనే శతకం సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అతడు 2019లో కోల్‌కతా వేదికగా నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి పింక్‌ బాల్‌ టెస్టులోనే శతకం సాధించాడు. తర్వాత మరో మూడంకెల స్కోర్‌ చేయకపోవడం గమనార్హం. దీంతో మాజీ సారథికి అదే చివరి శతకంగా మారింది. దీంతో అప్పటి నుంచీ ఎంత బాగా ఆడినా విరాట్‌ మరో సెంచరీ చేయలేకపోయాడు. ఇక ఇటీవల మొహాలి వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ 45 పరుగులతో ఆకట్టుకున్నా.. చివరికి అర్ధశతకం ముందు ఔటయ్యాడు. దీంతో వందో టెస్టులోనైనా శతకం సాధిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే, విరాట్‌ రేపటి నుంచి లంకతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో మరో 25 పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్క్‌వా, గ్యారీ సోబర్స్‌లను వెనక్కినెడుతాడు. 

ఇక రోహిత్‌ శర్మ గతేడాది అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో 66 పరుగులతో రాణించాడు. అతడు కూడా ఈ లంకతో జరిగే రెండో మ్యాచ్‌లో బ్యాట్‌ ఝుళిపిస్తే భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. దీంతో పింక్‌బాల్‌ టెస్టుల్లో కోహ్లీని అధిగమించి అత్యధిక పరుగులు చేసే వీలుంది. అతడి అభిమానులు సైతం ఇదే ఆశిస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే స్పిన్‌ దిగ్గజం అనిల్‌కుంబ్లేకు చెందిన ఓ అరుదైన రికార్డును సమం చేస్తాడు. గత మ్యాచ్‌లో అతడు టీమ్‌ఇండియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో కపిల్‌ దేవ్‌ (434)ను అధిగమించి రెండో స్థానానికి చేరుకొన్న చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోయే మ్యాచ్‌లోనూ మరోసారి బంతితో మాయ చేస్తే భారత్‌లో అత్యధికసార్లు ఐదు వికెట్లు సాధించిన కుంబ్లే (25) సరసన నిలుస్తాడు. అదే రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే కుంబ్లేనే అధిగమించి కొత్త చరిత్ర సృష్టిస్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని