IND vs NZ: అరుదైన రికార్డుకి చేరువగా భువీ‌.. కివీస్‌తో రెండో టీ20లో స్థానం దక్కేనా మరి..?

టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన సమయంలో విఫలమైన టీమ్‌ఇండియా మీడియం పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. అయితే కివీస్‌తో ఆదివారం జరిగే రెండో టీ20లో కుర్రాళ్లతో పోటీ పడి మరీ తుది జట్టులో స్థానం దక్కించుకోవడంపై సందిగ్ధత నెలకొంది.

Updated : 19 Nov 2022 16:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఆదివారం మౌంట్ మాంగనుయ్‌ వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ప్రస్తుతం కివీస్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు బౌలర్లలో అత్యంత సీనియర్‌ భువనేశ్వర్‌ కుమార్ మాత్రమే. తుది జట్టులో స్థానం కోసం కుర్రాళ్ల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. మరోవైపు పొట్టి ఫార్మాట్‌లో యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మాజీలు, అభిమానులు సూచిస్తున్నారు. దీంతో అందరి కళ్లూ భువీ వైపు మళ్లాయి. కివీస్‌తో జరిగే మిగతా రెండు టీ20ల్లో తుది జట్టులో స్థానం దక్కుతుందా..? లేదా..? అనే సందేహం అందరిలోనూ కొనసాగుతోంది. ఎందుకంటే డెత్‌ ఓవర్లలో భువీ ప్రదర్శన అద్భుతంగా ఏమీలేదు. భారీగా పరుగులు సమర్పించుకొన్నాడు.

ఇంకో నాలుగు తీస్తే.. 

టీ20 ఫార్మాట్‌లో భువనేశ్వర్ కుమార్‌ మరో అరుదైన రికార్డుకు చేరువగా ఉన్నాడు. 33 ఏళ్ల భువనేశ్వర్‌ కుమార్‌ (36 వికెట్లు) ప్రస్తుతం సంవత్సరంలో దాదాపు 30  టీ20లు ఆడాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 40 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించేందుకు మరో ‘నాలుగు’ అడుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌ బౌలర్‌ జేబీ లిటిల్‌ (39) టాప్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడు 26 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భువీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో ప్రభావం చూపే భువనేశ్వర్‌‌.. డెత్‌ ఓవర్లలో తేలిపోతున్నాడని ఇప్పటికే చాలాసార్లు మనం అనుకొన్న విషయం తెలిసిందే. అయితే అతడిని తెలివిగా పవర్‌ప్లే ఓవర్లోనే వినియోగించుకుంటే మాత్రం జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని మాజీలు సూచించారు. తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వెల్లింగ్టన్‌ మైదానం మాదిరిగా మౌంట్‌ మాంగనుయ్‌ స్టేడియం చిన్నది కాదు. బౌండరీలు కాస్త పెద్దగానే ఉంటాయి. కాబట్టి స్వింగ్‌ బౌలర్‌ భువీ తన అనుభవంతో రాణించే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని