IND vs SA: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తే భారత ఆటగాళ్లను స్వదేశానికి పంపిస్తాం : సీఎస్‌ఏ

టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ కరోనా విజృంభిస్తున్న..

Published : 23 Dec 2021 01:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు సిరీస్‌ను నిర్వహించాలని సీఎస్ఏ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిలో బెడ్లను కూడా సిద్ధం చేసింది. 3 టెస్టులు, 3 వన్డే మ్యాచుల కోసం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

‘భారత ఆటగాళ్లు ఏ కారణంగానైనా అనారోగ్యం పాలైతే తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఓ ఆస్పత్రిలో బెడ్లను ఏర్పాటు చేశాం. ఒకవేళ మ్యాచ్‌ జరగనున్న వేదికల్లో ఒమిక్రాన్‌ వేరియంట్ విజృంభిస్తే వారిని వెంటనే ఇండియాకు పంపిస్తామని దక్షిణాఫ్రికా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంపై భారత ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఆటగాళ్లు ఇక్కడే ఉంటామన్నా అందుకు తగ్గ సౌకర్యాలు కల్పిస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు వెళ్లాలనుకున్నా అందుకు అనుమతిస్తాం’ అని సీఎస్‌ఏ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్ షుయబ్ మంజ్రా పేర్కొన్నారు.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా డిసెంబరు 16న ప్రత్యేక ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో దక్షిణాఫ్రికా చేరుకుంది. అక్కడ సీఎస్ఏ కేటాయించిన హోటల్‌లోనే భారత ఆటగాళ్లు బస చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్‌ కోసం గ్రౌండ్‌కి వెళ్లి.. మళ్లీ నేరుగా హోటల్‌కే వస్తున్నారు. సెంచూరియన్‌లో తొలి రెండు టెస్టులు ముగిశాక.. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు కోసం ఆటగాళ్లంతా ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో కేప్‌ టౌన్‌ బయలు దేరనున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని