IND vs SL: మూడో వన్డేలో భారత్‌ విజయం.. ఎన్ని రికార్డులు నమోదయ్యాయో!

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో వన్డేలో భారత్‌ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌లో పలు కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. వాటిపై ఓలుక్కేద్దాం..!  

Published : 16 Jan 2023 06:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ని టీమ్‌ఇండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేయగా, శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా అషెన్‌ వాండర్సే బ్యాటింగ్‌ చేయలేదు. మరి ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం. 

  • 21: ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (166; 110 బంతుల్లో) భారీ శతకం బాదాడు. ఈ క్రమంలో స్వదేశంలో అత్యధిక సెంచరీలు (21) బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇన్నాళ్లూ ఈ రికార్డు సచిన్‌ (20) పేరిట ఉంది. 
  • 166: వన్డేల్లో కోహ్లీకిది రెండో అత్యధిక స్కోరు. 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 183 పరుగులు అతడి అత్యధిక స్కోరు.   
  • 10: వన్డేల్లో శ్రీలంకపై కోహ్లీకిది 10వ సెంచరీ. ఈ శతకంతో వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించాడు. సచిన్‌ (వెస్టిండీస్‌పై 9) రెండో స్థానంలో ఉన్నాడు. 
  • 317: వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే (317) భారీ విజయం. (ఐర్లాండ్‌పై 290) న్యూజిలాండ్‌ పేరిట ఉన్న రికార్డును భారత్‌ అధిగమించింది. 
  • (4/32): ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్‌ సిరాజ్‌ (4/32) ఆకట్టుకున్నాడు. వన్డేల్లో అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. 
  • 5: ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (12,574) ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మహేల జయవర్ధనే (12650)ను అధిగమించాడు. 
  • 73: వన్డేల్లో శ్రీలంకకు ఇది (73) నాలుగో అత్యల్ప స్కోరు. 
  • 2: ఈ ఫార్మాట్‌లో వేగవంతమైన (106 బంతుల్లో) 150 అందుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. ఇషాన్‌ కిషన్‌ (103 బంతుల్లో బంగ్లాదేశ్‌పై) తొలి స్థానంలో ఉన్నాడు. 
  • 8: ఈ మ్యాచ్‌లో కోహ్లీ 8 సిక్స్‌లు బాదాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో అతడి అత్యధిక సిక్స్‌లు ఇవే. 
  • 4: 50 ఓవర్ల ఫార్మాట్‌లో శ్రీలంకపై భారత్‌ నాలుగో (390/5) అత్యధిక స్కోరు ఇది. 
  • 3: శ్రీలంక ఆటగాడు అవిష్క ఫెర్నాండో ఈ సిరీస్‌లో మూడు సార్లు మహమ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. 
  • 10: అత్యధికంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌లు అందుకున్న ఆటగాళ్లలో కోహ్లీ(10) మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో సచిన్‌(15), రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు సనత్‌ జయసూర్య(11) కొనసాగుతున్నాడు. కోహ్లీ కేవలం 66 సిరీస్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. 
  • 5: వన్డేల్లో 150కి పైగా స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్లలో సచిన్‌, గేల్‌తో కలిసి కోహ్లీ(5) మూడోస్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్‌(8), డేవిడ్‌ వార్నర్‌(6) స్థానాల్లో ఉన్నారు.
  • 21: ఈ ఫార్మాట్లో శ్రీలంకపై అత్యధిక అర్ధసెంచరీలు చేసిన వ్యక్తుల్లో ధోనీతో కలిసి కోహ్లీ(21) రెండో స్థానంలో నిలిచాడు. తొలిస్థానంలో సచిన్‌(25) ఉన్నాడు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని