T20 World Cup: అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ కొట్టింది. అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 66 పరుగుల తేడాతో గెలుపొందింది.

Updated : 03 Nov 2021 23:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్గానిస్థాన్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్‌ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో కరీం జనత్ (42), మహ్మద్‌ నబీ (35) పోరాడారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి మూడు, రవిచంద్రన్‌ అశ్విన్ రెండు, బుమ్రా, జడేజా తలో వికెట్‌ తీశారు. రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ లభించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. షరాఫుద్దీన్‌ వేసిన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ ఫోర్‌, సిక్స్ బాదగా.. నవీన్‌ ఉల్ హక్‌ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు ఓవర్లో స్కోరు కాస్త నెమ్మదించింది. తర్వాత వీరిద్దరూ మళ్లీ ధాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు భారత్‌ స్కోరు 85/0 వద్ద నిలిచింది. రషీద్‌ఖాన్‌ వేసిన 14వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ తర్వాతి ఓవర్‌లోనే నబీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కొద్దిసేపటికే కేఎల్ రాహుల్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌ (27; 13 బంతుల్లో 1 ఫోర్‌, మూడు సిక్స్‌లు), హార్దిక్ పాండ్య ( 35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. గుల్బాదీన్‌ వేసిన 17వ ఓవర్‌లో పంత్‌ రెండు సిక్సర్లు కొట్టాడు. 18వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన హార్దిక్‌.. 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. 20వ ఓవర్‌లో పంత్‌ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. అఫ్గాన్‌ బౌలర్లలో గుల్బాదీన్‌, కరీం జనత్ తలో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని