IPL 2022: ధోనీ ఉన్నంతవరకూ చెన్నై ఆ విషయం ఆలోచించదు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి విషయంలో ఆ జట్టు తొందరపడదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు....

Published : 21 Mar 2022 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి విషయంలో ఆ జట్టు తొందరపడదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే 40 ఏళ్ల వయసున్న ధోనీ ఈసీజన్‌లో చివరిసారి కెప్టెన్సీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 సీజన్‌కు ముందు భవిష్యత్‌ కెప్టెన్‌ గురించి ఆ జట్టు ఆలోచించదని చెప్పాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై వసీమ్‌ జాఫర్‌ సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు.

‘ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎంచుకోవడానికి చెన్నై జట్టుకు ఇప్పుడు అవకాశం ఉంది. అయితే, అదెలా చేస్తారనేదే ప్రశ్న. సీజన్‌ ప్రారంభమైతే.. ఏ ఆటగాడు ఆ స్థానానికి సరిగ్గా సరిపోతాడో ఒక అంచనాకు రావొచ్చు. అందులో జడేజా, మొయిన్‌ అలీ లాంటి ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. కానీ, ధోనీ ఉన్నంతకాలం చెన్నై ఆ స్థానంలో మరొకరి గురించి ఆలోచించదు. అయితే.. జడేజా ఈసారి ధోనీ కన్నా అధిక మొత్తం తీసుకుంటున్నందున ఆ స్థానానికి అతడే సరైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అయితే.. అందుకు తగ్గ కార్యాచరణ ఇప్పుడే మొదలుకాదు’ అని చోప్రా వివరించాడు.

దీనిపై జాఫర్‌ మాట్లాడుతూ చోప్రాలాగే స్పందించాడు. ‘చెన్నై ఇప్పుడే భవిష్యత్‌ కెప్టెన్‌ గురించి ఆలోచిస్తుందని నేను కూడా అనుకోవడం లేదు. ఎవరైనా ప్రస్తుత పరిస్థితుల గురించే ఆలోచిస్తారు. ఇక టీ20లాంటి పొట్టి క్రికెట్‌లో ఇతర విషయాల గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. ఇప్పుడైతే ధోనీతో చాలా మంది యువకులు కలిసి ప్రయాణించొచ్చు. కానీ, చివరికి చెన్నై టీమ్‌ తమకు అనుగుణంగా ఉండే సారథినే ఎంపిక చేసుకుంటుంది’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని