Ind vs Aus: టీమ్‌ ఇండియా 36కి ఆలౌట్‌.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!

India vs Australia: రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో (Australia) పింక్‌ బాల్‌ టెస్ట్‌లో భారత్‌ (Team India) ఓ ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే అలౌట్‌ (36 allout) అయ్యింది. ఇప్పుడు ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. 

Published : 07 Feb 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) భారత్‌ - ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరిగే కీలక సిరీస్‌. అందులో విజయం దక్కితే.. ఆ ఆనందమే వేరు. అంతటి ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో భారత్‌ ఓ ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దాంతో ఆ మ్యాచ్‌లో దారుణ పరాజయం పాలైంది. భారత క్రికెట్‌ ప్రేమికులు ఈ విషయాన్ని ఎప్పటికీ మరచిపోరు. అందుకే ఇప్పుడు బదులు తీర్చుకునే టైమ్‌ వచ్చింది అని నాటి విషయాల్ని గుర్తు చేస్తున్నారు. 

అది డిసెంబరు 17, 2020.. ఆస్ట్రేలియా టూర్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌. అప్పట్లో టూర్‌లో ఒక పింక్‌ బాల్‌ టెస్ట్‌ (డే అండ్‌ నైట్‌ టెస్ట్‌) ఉండాలి అనుకునేవారు. అలా తొలి టెస్టునే పింక్‌ బాల్‌ టెస్ట్‌గా పెట్టుకున్నారు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 244 పరుగులు చేసింది. ఆసీస్‌ను 191కే పడగొట్టింది. దీంతో భారత్‌ విజయం సాధిస్తుందేమో అనుకున్నారంతా. కానీ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు భంగపాటు ఎదురైంది. కేవలం 36 పరుగులకే భారత బ్యాటర్లు దుకాణం సర్దేశారు. పాట్‌ కమిన్స్‌ 4, జోష్‌ హేజిల్‌వుడ్‌ 5 వికెట్లతో విరాట్‌ కోహ్లీ సేన నడ్డి విరిచారు. ఆ తర్వాత 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1- 0 ఆధిక్యం సంపాదించారు కూడా.

ఆ మ్యాచ్‌ ఓటమి ఓ బాధ అయితే.. 36 పరుగులకే ఆలౌట్‌ అవ్వడం ఇంకో బాధ. ‘మరీ అంత నాసిరకమైనా బ్యాటింగా మనది?’ అని ఒకటికి రెండుసార్లు అనుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత మన వాళ్ల వీరోచిత ప్రదర్శనతో ఆ సిరీస్‌ను 2-1తో గెలుచుకున్నాం. అయితే ఆ 36 పరుగుల పరాభవం మాత్రం అలానే ఉండిపోయింది. ఇప్పుడు ఆసీస్‌ మన దగ్గరకు వచ్చింది. ఈ నెల 9 నుంచి టెస్టు సిరీస్‌ మొదలవబోతోంది. దీంతో ‘36’ పరాభవానికి సరైన బదులు తీర్చుకోవాల్సిందే అని అభిమానులు కోరుతున్నారు. విరాట్‌ టీమ్‌కి జరిగిన పరాభవానికి ఇప్పుడు రోహిత్‌ టీమ్‌ ఎలాంటి రివేంజ్‌ తీర్చుకుంటుందో చూడాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని