Team India: ఇప్పటికీ ఆ ఓటమి బాధిస్తోంది.. దేవుడు మరోలా తలిచాడు: కేఎల్ రాహుల్, కుల్‌దీప్‌

వరల్డ్ కప్‌ ఫైనల్‌లో (ODI World Cup 2023) టీమ్‌ఇండియా ఓడి రన్నరప్‌గా నిలిచింది. దీంతో యావత్‌ దేశం నిరాశ చెందింది. తాజాగా టీమ్‌ఇండియా క్రికెటర్లు  కేఎల్ రాహుల్, కుల్‌దీప్‌ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Published : 23 Nov 2023 14:53 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఫైనల్‌ ముగిసి నాలుగు రోజులైనా ఆ ఓటమి చేదు జ్ఞాపకాలు మాత్రం టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్లను వదలడం లేదు. తాజాగా భారత మిడిలార్డర్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తోపాటు చైనామన్‌ బౌలర్ కుల్‌దీప్‌ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసీస్‌పై ఫైనల్‌ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో మూడు ఫొటోలను షేర్ చేసిన కేఎల్ రాహుల్ (KL Rahul) ‘‘ఇప్పటికీ బాధిస్తోంది’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో క్రికెట్ అభిమానులు కూడా రాహుల్‌కు మద్దతుగా కామెంట్లు చేశారు. ‘‘భారత జట్టు ఆటగాళ్లు మమ్మల్ని ఎంతో సంతోషపరిచారు. గర్వపడేలా చేసిన మీ పోరాటం అద్భుతం. తప్పకుండా బలంగా తిరిగి వస్తారు’’ అని ప్రతిస్పందించారు. కేఎల్‌ రాహుల్ ఈ మెగా టోర్నీలో 11 మ్యాచుల్లో 452 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

ముగింపు నిరుత్సాహపరిచింది: కుల్‌దీప్‌

మెగా టోర్నీలో ఫైనల్‌ మినహా మిగతా మ్యాచుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫైనల్‌లో ఓడినా.. తప్పకుండా పుంజుకుని వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటామని కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు మా ప్రయాణం ముగిసిన తీరు చివర్లో నిరుత్సాహానికి గురి చేసింది. దాదాపు ఆరు వారాలపాటు సాగిన మెగా టోర్నీలో మా లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ముందుకు సాగిన విధానం మాత్రం గర్వంగా ఉంది.  అయితే, ఫైనల్‌లో ఓటమి బాధ ఉన్నప్పటికీ.. తదుపరి అవకాశం కోసం తీవ్రంగా కష్టపడతాం. బాధ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. జీవితమంటే ఇదే. కప్‌ను అందుకోవడం అద్భుతంగా ఉంటుంది. అయితే, దేవుడు మరోలా తలిచాడు. కోలుకుని రావడం కష్టమే కానీ భవిష్యత్తుపై నమ్మకం ఉంచి ప్రయాణం కొనసాగిస్తాం’’ అని కుల్‌దీప్‌ పోస్టు పెట్టాడు. కుల్‌దీప్‌ యాదవ్ మొత్తం 11 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు