SA vs IND: మేం ఊహించింది ఒకటి.. జరిగింది మరొకటి: కేఎల్ రాహుల్

సౌతాఫ్రికాపై మొదటి వన్డేలో విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మాట్లాడాడు. 

Published : 18 Dec 2023 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో (SA vs IND) జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా (Team India) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ (5/37), అవేశ్‌ ఖాన్‌ (4/27) ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు 116 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో ఛేదించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మాట్లాడాడు.  

‘‘కెప్టెన్‌గా ఇక్కడ (దక్షిణాఫ్రికాలో) వన్డేల్లో మొదటి విజయం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గత పర్యటనలో నా కెప్టెన్సీలో మూడు వన్డేలు ఆడాం. అన్నింటిలో ఓడిపోయాం. పిచ్‌ మేం ఊహించిన దానికి పూర్తిభిన్నంగా స్పందించింది. ఎక్కువగా స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించాలని ప్రణాళికలు వేసుకున్నాం. గత మ్యాచ్‌లో ఇక్కడి పిచ్‌ స్పిన్నర్లకు ఎంతగా సహకరిచిందో చూశాం. దాంతో ఆరంభంలో అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌తో బౌలింగ్ చేయించాలనుకున్నాం. కానీ, పిచ్‌ పూర్తిగా పేసర్లకు అనుకూలించింది. సరైన ప్రదేశాల్లో బౌలింగ్‌ చేశారు. పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నారు’’ అని కేఎల్ రాహుల్ అన్నాడు. 

పింక్‌ వన్డే.. తొలి భారత కెప్టెన్‌గా రాహుల్ రికార్డు 

దక్షిణాఫ్రికాపై పింక్ వన్డేలో విజయం సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు పింక్‌ కలర్ జెర్సీలతో బరిలోకి దిగారు. చాలా ఏళ్లుగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య పింక్ వన్డే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించలేదు. తాజా మ్యాచ్‌తో ఆ రికార్డు బ్రేక్ అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు