NZ vs SL: భారీ విజయంపై కన్నేసిన న్యూజిలాండ్..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక.. 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. ప్రతిగా కివీస్‌ బ్యాటర్లు అదరగొడుతున్నారు. 

Updated : 09 Nov 2023 19:24 IST

బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారీ విజయంపై కన్నేసింది. 172 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభం అందించారు. వీరు తొలి వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, ఇద్దరూ వరుస ఓవర్లలో ఔటయ్యారు. చమీరా బౌలింగ్‌లో కాన్వే, తీక్షణ బౌలింగ్‌లో రచిన్.. ధనంజయకు చిక్కారు. కేన్‌ విలియమ్సన్ (14)ని ఏంజెలో మాథ్యూస్ పెవిలియన్‌కు పంపాడు. 19 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 132/3. డారిల్ మిచెల్ (29*),  చాప్‌మన్ (1*) క్రీజులో ఉన్నారు.


చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. ఆలౌటైన శ్రీలంక

ప్రపంచకప్‌ ఆఖరి దశకు చేరుకుంది. శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌లో ఓపెనర్ కుశాల్ పెరీరా (51; 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో విరుచుకుపడి 22 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లు పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఏంజెలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19), కరుణరత్నె (6), దుష్మంత చమీరా (1) పరుగులు చేశారు. 128 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన లంక.. మహీశ్‌ తీక్షణ (39*), దిల్షాన్‌ మదుశంక (19) పోరాడటంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3,  ఫెర్గూసన్ 2, మిచెల్ శాంట్నర్ 2, రచిన్‌ రవీంద్ర 2, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టారు. 

టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో నిశాంక ఔటయ్యాడు. అతడు వికెట్ కీపర్ లేథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత కుశాల్ మెండిస్, సదీర విక్రమార్కలను ట్రెంట్‌ బౌల్ట్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. బౌల్ట్ బౌలింగ్‌లోనే అసలంక ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మెరుపు అర్ధ శతకం బాదిన కుశాల్ పెరీరాను ఫెర్గూసన్ పెవిలియన్‌కు పంపాడు. శాంట్నర్‌ తన వరుస ఓవర్లలో మాథ్యూస్, ధనంజయను ఔట్ చేశాడు. వీరిద్దరూ డారిల్ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చారు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో కరుణరత్నె.. లేథమ్‌కు చిక్కాడు. చమీరాను రచిన్ రవీంద్ర ఔట్ చేశాడు. పదో వికెట్‌కు తీక్షణ, మదుశంక 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని