Salim Durani: క్రికెట్ దిగ్గజం సలీమ్‌ దురానీ కన్నుమూత

పాతతరం క్రికెటర్లలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటగాడు సలీమ్ దురానీ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated : 02 Apr 2023 13:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సలీమ్‌ దురానీ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తన సోదరుడు జహంగీర్ దురానీతో సలీమ్‌ ఉంటున్నారు.  తొడ ఎముక విరగడంతో  ఈ ఏడాది జనవరిలో శస్త్రచికిత్స జరిగింది. అయితే ఇటీవల క్యాన్సర్‌ బారిన పడటంతో పరిస్థితి విషమంగా మారింది. ఇవాళ కన్నుమూశారు. 

కాబూల్‌లో 1934లో జన్మించిన సలీమ్‌ 1960 నుంచి 1973 వరకు భారత్‌ తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 29 టెస్టులు ఆడి.. 50 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలతో 1,202 పరుగులు సాధించాడు. 1961-62 సీజన్‌లో ఇంగ్లాండ్‌ను ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో భారత్‌ ఓడించడంలో సలీమ్‌ దురానీ కీలక పాత్ర పోషించాడు.  తన ఆటతోనే కాకుండా డ్రెస్సింగ్‌ స్టైల్‌, ఆడంబరమైన జీవనశైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అఫ్గాన్‌లో జన్మించి భారత్‌లో టెస్టు క్రికెట్‌ ఆడిన ఏకైక ఆటగాడు సలీమ్‌ దురానీ. ఆయన మృతిపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సంతాపం తెలియజేశాడు. ‘‘భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత కలర్‌ఫుల్‌ ఆటగాడు సలీమ్‌ దురానీ. అతడి ఆత్మకు శాంతి కలగాలి. ఓం శాంతి’’ అని ట్వీట్ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని