SRH vs LSG: లఖ్‌నవూ గెలుపు.. సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు..!

కీలక పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతులేత్తేసింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

Updated : 13 May 2023 19:37 IST

హైదరాబాద్: కీలక పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతులేత్తేసింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి హైదరాబాద్ దాదాపుగా నిష్క్రమించినట్లే. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ.. 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రేరక్‌ మన్కడ్ (64*; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా.. చివర్లో నికోలస్‌ పూరన్ (44*; 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. స్టాయినిస్ (40; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో అభిషేక్ శర్మ, ఫిలిప్స్‌, మయాంక్‌ మార్కండే తలో వికెట్ పడగొట్టారు. 

మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు 

15 ఓవర్లకు వరకు లఖ్‌నవూపై ఆధిపత్యం చెలాయించిన హైదరాబాద్‌ బౌలర్లు.. తర్వాత చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ వేసిన 16 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది స్టాయినిస్‌ ఔటైనా.. హైదరాబాద్‌కు ఊరట దక్కలేదు. నికోలస్ పూరన్‌ క్రీజులోకి వచ్చి రావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు. నటరాజన్‌ వేసిన 17వ ఓవర్లో ప్రేరక్‌ మక్కడ్ వరుసగా 6,4 బాదాడు. భువనేశ్వర్‌ వేసిన 18వ ఓవర్లో చివరి రెండు బంతులను పూరన్‌ బౌండరీకి పంపడంతో లఖ్‌నవూ విజయ సమీకరణం 12 బంతుల్లో 14గా మారింది. 19 ఓవర్లో (నటరాజన్) పూరన్‌ సిక్స్‌తో సహా 10 పరుగులు వచ్చాయి. ఫారూఖి వేసిన చివరి ఓవర్‌లో రెండో బంతికి పూరన్‌ ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్ (47; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అన్మోల్‌ప్రీత్‌ సింగ్ (36; 27 బంతుల్లో 7 ఫోర్లు), అబ్దుల్ సమద్ (37; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు రాణించారు. గ్లెన్ ఫిలిప్స్‌ (0), అభిషేక్ శర్మ (7) నిరాశపర్చగా.. రాహుల్ త్రిపాఠి (20), మార్‌క్రమ్ (28) పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో కృనాల్ పాండ్య 2, యుధ్విర్‌ సింగ్, అవేశ్ ఖాన్‌, యశ్‌ ఠాకూర్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.

మ్యాచ్‌కు సంబంధించిన ఓవర్‌ టు ఓవర్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని