FIFA World cup 2022: అంబరాన్నంటిన అర్జెంటీనా సంబరాలు.. వెల్లువెత్తిన ప్రశంసలు

ఫిఫా ప్రపంచకప్‌(FIFA World Cup 2022)లో అర్జెంటీనా గెలుపుపై భారత క్రికెటర్లు స్పందించారు. ట్విటర్‌ ద్వారా ఆ జట్టు ప్రదర్శనను కొనియాడారు. 

Published : 19 Dec 2022 12:49 IST

బ్యూనస్ ఎయిర్స్‌: ఫిఫా ప్రపంచకప్‌(FIFA world cup 2022)లో గెలుపు అర్జెంటీనా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మెస్సి సేన విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. బాణాసంచా, కారు హారన్‌లతో వీధులన్నీ మోతెక్కాయి. డాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ అభిమానులు సందడి చేశారు. లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి చేరి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆర్థిక బాధలతో సతమతమవుతున్న వేళ తమ దేశాన్ని వరించిన ఈ గెలుపు ఎంతో విలువైందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్జెంటీనాలోని సెంట్రల్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ప్రముఖ కట్టడం ఒబెలిస్క్‌ దగ్గరున్న రివర్‌ ప్లేట్‌ ఒడ్డున దాదాపు 20లక్షల మంది చేరి సంబరాలు చేసుకున్నారు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌ను భారత క్రికెటర్లు సైతం ఆస్వాదించారు. అర్జెంటీనా(Argentina) సంచలన విజయం నమోదు చేసిన అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా ఆ జట్టుపై ప్రశంసలు కురిపించారు. 

* మెస్సి కల నెరవేర్చిన అర్జెంటీనా జట్టుకు నా అభినందనలు. ఓటమితో తమ ప్రయాణాన్ని ప్రారంభించినా.. అద్భుతంగా పుంజుకున్నారు. అదనపు సమయం ముగియటానికి ముందు మార్టినెజ్‌ గోల్స్‌ను అద్భుతంగా అడ్డుకొనడాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిందే.  అర్జెంటీనా గెలుస్తుందని అప్పుడే అనుకున్నా -సచిన్‌ తెందూల్కర్‌

* ఫైనల్‌లో సంచలనం సృష్టించారు. నాకు తెలిసి ఇదో గొప్ప ముగింపు - షోయబ్‌ అక్తర్‌

* నమ్మశక్యం కాని విధంగా మ్యాచ్‌ ఆడారు. మెస్సీ-ఎంబాపె పోరు మ్యాచ్‌కే హైలైట్‌. మెస్సి అతడి తరంలో అత్యున్నత ఆటగాడనేది నిర్వివాదాంశం. పీలే, మారడోనా తర్వాత మెస్సి ఆ స్థాయి ఆటగాడు. -రవిశాస్త్రి

* వారి గెలుపును ముందే ఊహించా. ప్రపంచ టైటిల్‌ గెలిచిన మెస్సి, అర్జెంటీనాకు అభినందనలు. ఎంబాపె జట్టు అసాధారణంగా పోరాడింది. ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం అదరగొట్టారు. - వసీం జాఫర్‌

* ఫైనల్ పోరును టీమిండియా ఆటగాళ్లంతా కలిసి చూస్తున్న ఫొటోను బీసీసీఐ షేర్‌ చేసింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని