Cricket News: ఆ బాధ లేదన్న రిజ్వాన్.. దూబెపై అశ్విన్ కామెంట్.. 41 బంతుల్లోనే ఆర్‌సీబీ స్టార్‌ సెంచరీ!

Published : 20 Jan 2024 21:42 IST

ఇంటర్నెట్ డెస్క్: తమ ఓపెనింగ్‌ జోడీని విడదీయడంపై వచ్చిన విమర్శలను కొట్టిపడేసిన రిజ్వాన్‌.. అఫ్గాన్‌తో టీ20ల్లో అదరగొట్టిన శివమ్‌ దూబెపై అశ్విన్‌ కామెంట్లు.. కేవలం 41 బంతుల్లోనే ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్ సెంచరీ.. పీసీబీ ఛైర్మన్ పదవికి జకా అష్రాఫ్‌ రాజీనామా.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

మీకు అలా అనిపిస్తుందేమో.. మాకు కాదు: రిజ్వాన్

‘‘పాకిస్థాన్‌ జట్టును బాధపెడుతుందని మీరు చెబుతారు. నేను మాత్రం అలా చెప్పలేను. బాబర్‌ అజామ్ గొప్ప మనసు కలిగినవాడు. మేమిద్దరం అంగీకరించిన తర్వాతనే మా జోడీని విడదీశారు. ఇందులో ఏ సమస్య లేదు. ఎలాంటి కూర్పుకైనా మేం సిద్ధమని మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాం. బాగా ఆడుతున్నప్పుడు ఇలాంటివి చేయడం వల్ల కొందరికి బాధగా అనిపించవచ్చు. జట్టుకు మాత్రం విభిన్న కాంబినేషన్లను ప్రయత్నించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యం కనిపిస్తోంది. అవసరమైతే మేమిద్దరం భవిష్యత్తులో మళ్లీ ఓపెనింగ్‌ చేస్తాం’’ అని రిజ్వాన్‌ వెల్లడించాడు.


శివమ్‌ దూబెకు అవకాశం వస్తే మంచిదే: అశ్విన్‌

‘‘చాలామంది హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె జట్టులో ఉండాలని చెబుతున్నారు. దూబె ఆటతీరు కూడా అద్భుతంగా ఉంది. అతడి కెరీర్‌ ఎలా ఉందంటే ‘బిఫోర్ సీఎస్‌కే’.. ‘ఆఫ్టర్ సీఎస్‌కే’ అన్నట్లుగా ఉంది. పాక్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వెస్టిండీస్‌లోనూ పిచ్‌లు అలాగే ఉంటాయి. అందుకే సీఎస్‌కే తరఫున హిట్టింగ్‌ చేసే దూబె విండీస్‌లోనూ రాణించగలడు. అతడిని చూస్తే యువరాజ్‌ను చూసినట్లు అనిపిస్తోంది. ‘యువీ లైట్‌’ అని దూబెను సగర్వంగా పిలుస్తా. స్పిన్‌ అద్భుతంగా ఆడతాడు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.


విల్‌ జాక్స్‌ సూపర్ సెంచరీ

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విల్‌జాక్స్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికా20 లీగ్‌లో ఆడుతున్నాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన విల్‌ డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 41 బంతుల్లో సెంచరీ బాదాడు. ఇందులో 9 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. దీంతో ప్రిటోరియా 20 ఓవర్లలో 204/9 స్కోరు చేసింది. అనంతరం డర్బన్ 187 పరుగులకే ఓటమి పాలైంది. దీంతో వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో విల్‌ జాక్స్‌ విశ్వరూపం చూస్తామని ఆర్‌సీబీ అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. గతేడాది గాయం కారణంగా దూరమైన విల్‌ జాక్స్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని తమకు తిరుగులేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పీసీబీ ఛైర్మన్ పదవికి జకా అష్రాఫ్ రాజీనామా

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌ పదవికి జకా అష్రాఫ్‌ రాజీనామా చేశారు. 2023 జులై 6న ఈ పదవిలోకి వచ్చిన జకా అర్ధంతరంగానే వైదొలగడం క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. తన రాజీనామాను పాక్‌ ప్రధాని అన్వార్ ఉల్ హక్ కకార్‌కు జకా పంపించారు. ఓవైపు పీసీబీ మీటింగ్‌ జరుగుతుండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరల్డ్‌ కప్‌ అనంతరం బాబర్‌ అజామ్‌, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..  బాబర్‌తో పాటు ఓ పీసీబీ అధికారి   మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణలను మీడియలో లీక్‌ చేయడం వంటి చర్యలతో జకా అష్రాఫ్‌ విమర్శలు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని