MS Dhoni: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? స్టీఫెన్ ఫ్లెమింగ్‌ కీలక వ్యాఖ్యలు

ప్రతి మ్యాచ్‌ సందర్భంగా ఎంఎస్ ధోనీ (MS Dhoni) వీడ్కోలుపైనే చర్చ. ఆ జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా సరే.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం కామెంట్లు రావడం ఆగలేదు. తాజాగా సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ కూడా మరోసారి స్పష్టతనిచ్చాడు.

Published : 01 May 2023 17:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2023వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంది. కెప్టెన్ కూల్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలో సీఎస్‌కే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ తలెత్తే అనుమానం.. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడా..? లేకపోతే ఇదే చివరి సీజనా..?. ఎందుకంటే ప్రస్తుత సీజన్‌లోనే మోకాలి నొప్పితో బాధపడుతూనే జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను నెగ్గి ముంబయితో సమంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా సీఎస్‌కేను నిలబెట్టాలని చూస్తున్నాడు. అయితే, వివిధ సందర్భాల్లో తన వీడ్కోలుపై చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ స్పందించాడు. పంజాబ్‌ చేతిలో చివరి బంతికి ఓటమిపాలైన అనంతరం ఫ్లెమింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ధోనీ ఎప్పుడూ రిటైర్‌మెంట్‌పై ప్రత్యేకంగా చెప్పలేదని ఫ్లెమింగ్‌ స్పష్టం చేశాడు. 

‘‘ఐపీఎల్ 2023 సీజనే తనకు చివరిదని ధోనీ ఎప్పుడూ చెప్పలేదు. అతడికి ఆ ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదు. ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలవడంపైనే దృష్టిసారించాం’’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు. కోల్‌కతాతో మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. తన ఐపీఎల్‌ కెరీర్‌ చివరి దశలో ఉందని, ఇక్కడకు వచ్చినవారంతా వీడ్కోలు పలికేందుకు వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించాడు. గత సీజన్‌లోనూ ఇలానే ధోనీ ఆడటంపై సందేహాలు వచ్చినా.. వాటన్నింటినీ కొట్టిపడేస్తూ ఈ సీజన్‌లోనూ సీఎస్‌కేను నడిపిస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సొంత మైదానాల్లో మ్యాచ్‌లు జరగుతుండటంతో అభిమానులు భారీగా హాజరవుతున్నారు. ఈ క్రమంలో తన హోం గ్రౌండ్‌లోనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతానని గతంలో ధోనీ ప్రకటించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు