Jagadeesan: ఆ ప్రశ్న సీఎస్‌కేను అడగండి.. ధోనీ మాత్రం చాలా సాయం చేశాడు: జగదీశన్‌

దాదాపు మూడేళ్లపాటు చెన్నై జట్టులో ఉన్నప్పటికీ పట్టుమని పది మ్యాచ్‌లు కూడా ఆడలేకపోయాడు. అయితే ఈసారి దేశవాళీ క్రికెట్‌లో మాత్రం పెను సంచలనంగా మారాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరునే కాకుండా వరుసగా ఐదు సెంచరీలు చేసి ఆశ్చర్యపరిచాడు.

Published : 27 Dec 2022 01:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నారాయణ్‌ జగదీశన్‌.. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా ఒకే ఇన్నింగ్స్‌లో 277 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఐపీఎల్‌ (IPL 2023) మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జగదీశన్‌ను రూ. 90 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీతో ఉన్నప్పటికీ  కేవలం ఏడు మ్యాచుల్లోనే ఆడే అవకాశం వచ్చింది. వచ్చే సీజన్‌లో కోల్‌కతా తరఫున ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు జగదీశన్‌ వెల్లడించాడు. అలాగే చెన్నై జట్టులో ఉన్నప్పుడు ధోనీ ఎంతో మద్దతుగా నిలిచాడని గుర్తు చేసుకొన్నాడు. 

‘‘సీఎస్‌కేలో ఉన్నప్పుడు.. ఎంఎస్ ధోనీతో కలిసి ఆడే అవకాశం రావడం అదృష్టం. ఎలాంటి అనుమానాలు ఉన్నప్పటికీ నిస్సంకోచంగా అడిగేవాడిని. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడు. వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌కు సంబంధించి టెక్నికల్‌ అంశాల్లో సూచనలు ఇచ్చాడు. అలాగే మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా ఆడాలనేది కూడా తెలుసుకోగలిగా’’ అని జగదీశన్ తెలిపాడు. 

అయితే ఫామ్‌లో ఉన్న తనను సీఎస్‌కే ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు స్పందించాడు. ‘‘ఇలాంటి ప్రశ్నలను సీఎస్‌కే యాజమాన్యాన్ని అడిగితేనే బాగుంటుంది. దానిపై దృష్టిపెట్టదలుచుకోలేదు. ఆటను మెరుగుపర్చుకోవడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం’’ అని ఈ యువ బ్యాటర్‌ స్పష్టం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని