Romario Shepherd: క్లియర్ మైండ్‌సెట్‌తో ఆడా.. బాగా తినడమే నా రహస్యం: రొమారియో షెఫర్డ్‌

రొమారియో షెఫర్డ్‌ భారీ హిట్టింగ్‌తో ముంబయి తొలి విజయాన్ని నమోదు చేసింది.

Updated : 08 Apr 2024 11:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి విజయాల ఖాతా తెరిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆ జట్టుకిదే తొలి గెలుపు. దిల్లీపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకొన్న రొమారియో షెఫర్డ్ (Romario Shepherd) కేవలం 10 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. నోకియా వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. తన ఇన్నింగ్స్‌పై స్పందించాడు.

‘‘ఇన్నాళ్లు చేసిన కష్టానికి ప్రతి ఫలం. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించా. డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు దేని గురించీ ఆలోచించకూడదు. స్పష్టమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాలి. టిమ్‌ డేవిడ్‌తో కలిసి చివరి ఓవర్‌లో ఆడా. భారీగా హిట్టింగ్‌ చేయాలని అతడే చెప్పాడు. మైదానంలో ఒక్క వైపే పరుగులు రాబట్టాలని అనుకోలేదు. ఇలా బంతిని బాదాలంటే చాలా బలం కావాలి. బాగా తినడమే దానికి కారణం (నవ్వుతూ). అందులో ఇండియన్‌ ఫుడ్‌ కూడా ఉంది’’ అని రొమారియో వ్యాఖ్యానించాడు.

అది మామూలు హిట్టింగ్ కాదు: హార్దిక్‌ పాండ్య

‘‘నాలుగో మ్యాచ్‌లో మేం విజయం సాధించగలిగాం. చాలా తీవ్రంగా సాధన చేశాం. వ్యూహాత్మక మార్పులు చేసుకుంటూ మ్యాచ్‌పై పట్టు సాధించాం. జట్టులోని ప్రతి ఆటగాడూ సెట్‌ కావడం ముఖ్యం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతి ఒక్కరికీ మద్దతు ఉంటుంది. చివరి ఆరు ఓవర్లలో 70+ పరుగులు చేశాం. ఆఖరి ఓవర్‌లో షెఫర్డ్‌ భారీ హిట్టింగ్‌ చేశాడు. అది మామూలు ఆట కాదు. దిల్లీతో మ్యాచ్‌లో అతడి ప్రదర్శనే కీలకం. అతడే మమ్మల్ని గెలిపించాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. (తాను బౌలింగ్‌ చేయకపోవడంపై) నేను బాగానే ఉన్నా. సరైన సమయంలో బౌలింగ్‌ చేస్తా. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించాం’’ అని ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అన్నాడు. 

మరికొన్ని విశేషాలు.. 

  • ఐపీఎల్‌లో ముంబయి 200+ స్కోరు చేసిన 14 మ్యాచుల్లోనూ గెలవడం విశేషం. వాంఖడేలో 50 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబయి నిలిచింది.
  • టీ20ల్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా ముంబయి అవతరించింది. ముంబయి తర్వాత చెన్నై (148),  భారత్ (144), లాంక్‌షైర్ (143), నాటింగ్‌హామ్‌షైర్ (143) ఉన్నాయి.
  • ఐపీఎల్‌లో దిల్లీ తరఫున మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్ ఆన్రిచ్‌ నోకియా (65). ఉమేశ్ యాదవ్ కూడా బెంగళూరుపై 2013లో 65 పరుగులే ఇచ్చాడు.
  • ఒక్క హాఫ్‌ సెంచరీ లేకుండా టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదైన ఇన్నింగ్స్‌ ఇదే. దిల్లీపై ముంబయి 234/5 స్కోరు చేసింది. ఒక్క బ్యాటర్‌ కూడా అర్ధశతకం చేయలేదు. రోహిత్ శర్మ (49) టాప్‌ స్కోరర్.
  • కనీసం 10 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌(390) సాధించిన ఆటగాడు షెఫర్డ్‌.
  • దిల్లీ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతులు). క్రిస్‌ మోరిస్‌ (2016లో 17 బంతులు) ముందున్నాడు.
  • ముంబయి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో 150 వికెట్ల మార్క్‌ను తాకాడు. లసిత్ మలింగ (170) ముంబయి తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని