Umran Malik: ఉమ్రాన్‌తో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తే గాయాలబారిన పడతాడు

హైదరాబాద్‌ యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను అధికంగా ఉపయోగించుకుంటే గాయాలబారిన పడతాడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 29 Apr 2022 11:42 IST

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌

(Photos: Umran Malik and Munaf Patel Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటే గాయాలబారిన పడతాడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డాడు. అదే జరిగితే అతడు తన పేస్‌ను మార్చుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్‌లో ఉమ్రాన్‌ నిలకడగా బౌలింగ్‌ చేస్తూ 150కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఉమ్రాన్‌ బౌలింగ్‌పై స్పందించిన మునాఫ్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

‘ఉమ్రాన్‌ బౌలింగ్‌ చేయడానికి పరుగెత్తుతుంటే నేను కూడా బౌలింగ్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ టీ20 టోర్నీ ద్వారా ఇలాంటి నైపుణ్యమున్న ఆటగాళ్లు వెలుగులోకి రావడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా సరైన వసతులు లేని గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా బయటకు రావడం మంచి విషయం. లేకపోతే అతడు ఎక్కడ ఆడేవాడో ఎవరికి తెలుసు. ఇప్పుడైతే ఈ సీజన్‌లో అత్యధిక వేగంగా బంతులేస్తున్న బౌలర్‌గా నిలిచాడు’ అని మునాఫ్‌ చెప్పుకొచ్చాడు.

అలాగే బీసీసీఐ అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి ఆలస్యం చేయొద్దని, తొలుత దేశవాళీ క్రికెట్‌లో అవకాశాలిచ్చి తర్వాత టీమ్‌ఇండియాకు తీసుకురావద్దని చెప్పాడు. ఇప్పటినుంచే జట్టుతో కలిసి పంపాలన్నాడు. దాంతో అతడు అంతర్జాతీయ పరిస్థితులకు త్వరగా అలవాటు పడతాడన్నాడు. అలాగే ఫాస్ట్‌బౌలర్లు ఏడాదికి ఇన్ని మ్యాచ్‌లే ఆడాలనే కచ్చితమైన నిబంధనలు ఉండాలని, తద్వారా ఆటగాళ్లు గాయాలబారిన పడకుండా ఉంటారని అన్నాడు. ఇప్పుడు టెక్నాలజీ, ట్రైయినింగ్‌, ఫిజియోథెరపీ సదుపాయాలు మెరుగైనా ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి ఆటగాడిని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. ఒకవేళ అతడితో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తే.. గాయాలబారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. దాంతో ఉమ్రాన్‌ తన పేస్‌బౌలింగ్‌లో మార్పులు చేసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడైతే అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని మునాఫ్‌ మెచ్చుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని