Cricket News: ఆ లీగ్‌లో నవీనుల్ హక్‌పై నిషేధం.. వైరల్ అవుతోన్న చాహల్ కొత్త ప్రొఫైల్ పిక్‌

అఫ్గానిస్థాన్‌ ఫాస్ట్ బౌలర్‌ నవీనుల్ హక్‌ (Naveen-ul-Haq)పై ఇంటర్నేషనల్‌ లీగ్ టీ20 (ILT20) నిషేధం విధించింది. 

Published : 19 Dec 2023 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌ ఫాస్ట్ బౌలర్‌ నవీనుల్ హక్‌ (Naveen-ul-Haq)పై ఇంటర్నేషనల్‌ లీగ్ టీ20 (ILT20) నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. యూఏఈ వేదికగా జరిగే ఈ లీగ్‌లో నవీనుల్ హక్‌ షార్జా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి- ఫిబ్రవరి మధ్య జరిగిన తొలి సీజన్‌లో షార్జా తరఫున ఆడాడు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకానున్న రెండో సీజన్‌ కోసం వారియర్స్‌ యాజమాన్యం నవీనుల్ కాంట్రాక్ట్‌ను పొడగించింది. కానీ, రిటెన్షన్‌ నోటీసుపై సంతకం చేయడానికి అతడు నిరాకరించాడు. ఫ్రాంఛైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకుగాను ILT20 నవీనుల్‌ హక్‌పై 20 నెలల నిషేధం విధించింది. 2023లో జరిగిన ILT20 తొలి సీజన్‌లో నవీనుల్ మంచి ప్రదర్శన కనబర్చాడు. జునైద్‌ సిద్ధిఖ్‌తో కలిసి అత్యధిక వికెట్లు (11) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.


వైరల్‌ అవుతోన్న చాహల్ ప్రొఫైల్ పిక్‌ 

క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ముంబయి ఇండియన్స్‌- రోహిత్‌ శర్మ(Rohit Sharma) గురించే చర్చ జరుగతోంది. ముంబయి కెప్టెన్‌గా రోహిత్‌ స్థానంలో హార్ది్‌క్‌ పాండ్య (Hardik Pandya)ను నియమించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముంబయి మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal)  సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X) ఖాతా కొత్త ప్రొఫైల్‌ పిక్‌ వైరల్‌గా మారింది. చాహల్‌, రోహిత్‌ శర్మపై తనకున్న అభిమానాన్ని చాటుతూ వారిద్దరూ ఓ మ్యాచ్‌ సందర్భంగా దిగిన ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్నాడు. రోహిత్‌ను ముంబయి కెప్టెన్‌గా తొలగించడంతో అతనికి మద్దతుగా నిలిచేందుకు చాహల్ ఇలా ప్రొఫైల్‌ పిక్‌ని ఛేంజ్‌ చేశాడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని