IND Vs BAN : అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. కోహ్లీ ఆటతీరుపై చిన్ననాటి కోచ్‌ విమర్శలు

పరుగుల వీరుడిగా పేరున్న కింగ్‌ కోహ్లీ(Virat Kohli) బంగ్లాతో జరిగిన రెండు టెస్టుల్లో చేసింది మొత్తం 45 పరుగులు మాత్రమే. దీంతో అతడి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 26 Dec 2022 12:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : బంగ్లాతో టెస్టు సిరీస్‌(IND Vs BAN)ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే.. రెండో టెస్టులో ప్రత్యర్థి నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత(Team India) టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. బంగ్లా స్పిన్నర్లను ఎదుర్కోవడానికి వీరు ఇబ్బందు పడ్డారు. దీంతో వీరి ఆటతీరుపై  ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కింగ్‌ కోహ్లీ(Virat Kohli) ఈ రెండు టెస్టుల్లో చేసింది మొత్తం 45 పరుగులే. దీంతో విరాట్‌ ఆటతీరును అతడి అభిమానులే కాదు.. చిన్నప్పటి కోచ్‌ కూడా విమర్శించకుండా ఉండలేకపోయాడు. అతడు ఔటు అవుతున్న తీరు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు.

‘బంగ్లా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విరాట్‌ లాంటి క్లాస్‌ ఆటగాడు ఇబ్బందిపడటం దురదృష్టకరం. అతడు ఔట్‌ అవుతున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అతడు రాణించాల్సి ఉండేది. స్పిన్నర్లను ఎదుర్కొనే విషయంపై ఫ్రీమైండ్‌సెట్‌తో ఆడాలి. మిడాఫ్‌, మిడాన్‌ ఫీల్డర్లు ఇన్‌సైడ్‌ సర్కిల్‌లో ఉన్నప్పుడు.. కాస్త స్వేచ్ఛగా ఆడాలి. స్పిన్నర్లను కలవరపెడితే తప్ప.. వారు మిమ్మల్ని ఆడనివ్వరు’ అంటూ కోహ్లీ చిన్నప్పటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ ఓ క్రీడా ఛానల్‌కు వివరించాడు.

ఇక బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడ్డ జట్టును అశ్విన్‌, శ్రేయస్‌ కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. స్పిన్నర్ల ముప్పేట దాడిని తట్టుకుని.. పరాభవ ప్రమాదాన్ని తప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని