R Praggnanandhaa: కార్ల్‌సన్‌ను ఓడించడం ఆశ్చర్యం కలిగించలేదు: ఏఐసీఎఫ్‌ కార్యదర్శి

 ప్రపంచ నంబర్‌వన్‌ చెస్‌ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి...

Published : 22 Feb 2022 21:40 IST

ప్రజ్ఞానందపై ప్రశంసల జల్లు

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ నంబర్‌వన్‌ చెస్‌ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనంగా మారిన ప్రజ్ఞానందపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సన్‌ను 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మట్టికరిపించాడు. అయితే కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించడంపై ఆశ్చర్యం కలగలేదని అఖిల భారత చెస్‌ ఫెడరేషన్‌ (ఏఐసీఎఫ్‌) కార్యదర్శి భరత్‌ సింగ్ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. ప్రజ్ఞానంద వద్ద చాలా అద్భుతమైన వ్యూహాలు ఉన్నాయని చెప్పారు. 

‘‘అంతర్జాతీయంగా వివిధ ఈవెంట్లలో ప్రజ్ఞానంద ప్రదర్శనను చూసిన తర్వాత కార్ల్‌సన్‌ను ఓడించడం నాకైతే ఆశ్చర్యం కలిగించలేదు. కుర్రాళ్లైన ప్రజ్ఞానంద, నిహాల్ సరిన్, గుకేష్, అర్జున్‌ నుంచి ఇంకా సంచలనాలు వస్తాయని భావిస్తున్నా. వీరందరూ చాలా బాగా ఆడుతున్నారు. అదేవిధంగా కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించడం అద్భుతమైన ఫీలింగ్‌. చాలాబాగా ఆడాడు. టోర్నమెంట్‌లో అట్టడుగు నుంచి టాప్‌-3 సీడెడ్‌కు ఎగబాకాడు. ఆడేటప్పుడు ఎదుట ఎవరున్నారనేది కాకుండా కేవలం ఎత్తుల గురించి  మాత్రమే ఆలోచిస్తాడు. టాప్‌ ఆటగాళ్లందరితో ఆడతాడు.. చాలా డైనమిక్‌. వ్యూహాలను అమలు చేయడంలో సూపర్‌. అన్ని గేముల్లో అతడి అత్యుత్తమ ప్రదర్శనను బయట పెడతాడు. అది 39 ఎత్తులా లేదా 89 ఎత్తులా అని కాదు. చివరిదాకా పోరాడుతూనే ఉంటాడు. ప్రపంచంలోని టాప్‌ ప్లేయర్లను ఓడించగల సత్తా ప్రజ్ఞానందకు ఉంది. ఏ అగ్రశ్రేణి ఆటగాడూ ప్రజ్ఞానందను తక్కువగా అంచనా వేయడు’’ అని చౌహాన్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని