Ashwin: టీమ్‌ఇండియాకు అతిపెద్ద శత్రువును పరిచయం చేస్తున్నా: అశ్విన్‌

దక్షిణాఫ్రికా పర్యటనలో (IND vs SA) ఉన్న భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు.

Published : 24 Dec 2023 14:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌ వేదికగా భారత్‌ తొలి టెస్టులో (IND vs SA) తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ను గెలుచుకోలేకపోయింది. ఈసారి ఆ రికార్డును బ్రేక్‌ చేయాలని టీమ్‌ఇండియా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే అశ్విన్‌ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. అశ్విన్‌ పరిచయం చేసిన వ్యక్తిని ‘భారత జట్టుకు అతిపెద్ద శత్రువు’ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ మీ కోసం..

‘‘సర్‌ మిమ్మల్ని పరిచయం చేయాలంటే ఏమని పిలవాలి?’’ అని సదరు వ్యక్తిని అశ్విన్‌ అడుగుతాడు.

‘‘పప్పా వెంకటేశ్‌ అని పిలిస్తే చాలు’’ అని సమాధానం వస్తుంది.

ఆయనకు ఈ పేరు రావడానికిగల కారణాలను వివరిస్తూనే అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పుడు మీకు పరిచయం చేసిన వ్యక్తి భారత క్రికెట్‌జట్టుకు అతిపెద్ద విలన్. అతడు వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ జట్టు ఆసీస్‌కు గత నెల వరకు స్థానిక మేనేజర్‌. మీరు ఎందుకు ఇలా చేశారు సర్? ఇప్పుడు ఎలా ఉన్నారు?’’ అని అశ్విన్‌ ప్రశ్నించాడు.

వెంకటేశ్: గత నెల వరకు నా జీవితం సాఫీగా ఉండేది. ఆ తర్వాత నుంచి ఆ ప్రశాంతతను కోల్పోయా

అశ్విన్‌: వరల్డ్ కప్‌ సందర్భంగా ఆసీస్‌ జట్టుతోపాటు దేశమంతా తిరిగారు. ఏది కావాలన్నా వారు మిమ్మల్నే సంప్రదించారు. ఇప్పుడు భారత్‌-ఎ జట్టుతో పాటు ఉన్నారు. అప్పటి.. ఇప్పటి అనుభవం ఎలా ఉంది?

వెంకటేశ్: నేను ఆసీస్‌ జట్టుతో ఉన్నా.. భారత్‌-ఎ వెంట ఉన్నా చేసే కర్తవ్యం అదే. అయితే, భారత జట్టులో చాలా మంది తెలిసినవారే కాబట్టి ఇంకాస్త బాగుంది.

అశ్విన్‌: మిమ్మల్ని లైవ్‌కు పిలుద్దామా? వద్దా? అని ఆలోచించా. అనవసరంగా బలిపశువును చేసినట్లు అవుతుందని ఆలోచించా?

వెంకటేశ్‌: బలిపశువు కావడానికి నాకు నేనుగా వచ్చా. (నవ్వుతూ)

అశ్విన్: ఈయనే మాకు లోకల్ మేనేజర్‌. జట్టుకు అవసరమైన వాటన్నింటినీ వెంకటేశ్‌ సమకూరుస్తారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని