Asia Cup 2022: ఉత్కంఠ పోరులో అఫ్గాన్‌పై నెగ్గిన పాక్‌.. భారత్‌ ఇంటికి

ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌ అవకాశాలకు గండిపడింది. అఫ్గాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్‌ జట్టు ఒక వికెట్‌ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌లో ఛేదించింది.

Updated : 07 Sep 2022 23:27 IST

షార్జా: ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌ అవకాశాలకు గండిపడింది. అఫ్గాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్‌ జట్టు ఒక వికెట్‌ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌లో ఛేదించింది. ఈ విజయంతో పాక్‌ జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది. దీంతో గురువారం భారత్‌, అఫ్గాన్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ జట్టు గెలుపొంది ఉంటే భారత్‌కు ఫైనల్‌ అవకాశాలు ఉండేవి. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఆ జట్టులో ఇబ్రహీం జద్రాన్‌(35) టాప్‌ స్కోరర్‌. మిగతావారు విఫలం కావడంతో అఫ్గాన్‌ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితం అయింది. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రవూఫ్‌ రెండు వికెట్లు తీయగా, నసీమ్‌ షా, మహమ్మద్‌ హస్నేన్‌, నవాజ్‌, షాదాబ్‌ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.2 ఓవర్లలో ఛేదించింది. చివరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 11 పరుగులు అవసరం కాగా చేతిలో ఒకే వికెట్‌ ఉంది. అయితే ఒత్తిడిని తట్టుకొని పాక్‌ బ్యాటర్‌ నసీమ్‌ షా వరుస రెండు బంతులను సిక్సర్‌లుగా మలిచి ఆజట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో షాదాబ్‌ ఖాన్‌(36) ఇఫ్తీకర్‌ అహ్మద్‌(30) రాణించారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూకీ, అహ్మద్‌ మాలిక్‌ తలో మూడు వికెట్లు, రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని