T20 World Cup: పాక్‌ చేతిలో భారత్‌ ఘోర పరాజయం

శభారత్‌కు ఘోర పరాభవం. భారత్‌పై పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో గెలిచింది. 

Updated : 25 Oct 2021 02:25 IST

దుబాయ్‌: టైటిల్‌ ఫేవరేట్‌.. సూపర్‌ బ్యాటింగ్‌.. దుమ్మురేపే బౌలింగ్‌.. అంటూ హోరెత్తిన క్రికెట్‌ అభిమానులను టీమిండియా దారుణ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపర్చింది. ఘోర ఓటమితో ఇప్పటి వరకు పాకిస్థాన్‌పై ఉన్న విజయాల రికార్డును కోహ్లీసేన చేజార్చుకుంది. టీ20 ప్రపంచకప్‌ వేటను ఓటమితో ఆరంభించింది భారత్‌. ఓ పసికూన మాదిరిగా దాయాది చేతిలో పరాభవం ఎదుర్కొంది.

టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో పాక్‌కు 152 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం పాక్‌ వికెట్ నష్టపోకుండా 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మహమ్మద్‌ రిజ్వాన్ (79*), కెప్టెన్ బాబర్ అజామ్ (68*) భారీ భాగస్వామ్యంతో పాక్‌కు విజయాన్ని అందించారు. భారత బౌలర్లు ఎంత కష్టపడినా వికెట్‌ దక్కలేదు. టీమిండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాక్‌ బ్యాటర్లు నింపాదిగా తమపని చేసుకుని వెళ్లిపోయారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా అన్నిరంగాల్లో రాణించిన పాకిస్థాన్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌పై పాకిస్థాన్‌ తొలి విజయం సాధించడం విశేషం.

కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించినా.. 

తొలి ఓవర్‌లోనే టీమిండియాకు దెబ్బ పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే కేఎల్ రాహుల్ (3)కూడా పెవిలియన్‌కు చేరాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ (57) అర్ధశతకం.. రిషభ్‌ పంత్ (39) రాణించడంతో టీమిండియా ఓ మోస్తరు స్కోరును చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ 11, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య 11 పరుగులు చేశారు. పాకిస్థాన్‌ బౌలర్లలో షాహీన్ 3, హసన్‌ అలీ 2, షాదాబ్‌ ఖాన్‌ ఒక వికెట్ తీశారు. మ్యాన్‌ ద మ్యాచ్‌గా షాహీన్‌ అఫ్రిది ఎంపికయ్యాడు. 

మ్యాచ్‌ అనంతరం భారత్‌, పాక్‌ జట్ల సారథులు ఏమన్నారంటే.. 

భారత సారథి విరాట్ కోహ్లీ -  ‘‘మా ప్రణాళికను మేం సరిగా అమలు చేయలేకపోయాం. పాకిస్థాన్‌ ఆటగాళ్లు బాగా ఆడారు. వారు బౌలింగ్‌ ఎంచుకుని బంతితో మంచి ఆరంభం సాధించారు.  కనీసం ఇంకో 15-20 పరుగులు అదనంగా చేయాల్సింది. అయితే ఆఖరికి ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచినా.. పాక్‌ వికెట్లను ఆరంభంలో తీయలేకపోయాం. పాక్‌ ఓపెనర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్లో బౌలర్‌ లేకపోవడం లోటు అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో పెద్దగా ఎఫెక్ట్‌ చూపినట్లైతే లేదు. టోర్నీలో ఇది మొదటి మ్యాచ్‌ మాత్రమే. చివరిది కాదు.. మేం పుంజుకుని బరిలోకి దిగుతాం..

భారత్‌పై ఘన విజయం సాధించడం పట్ల పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ విజయం జట్టు అందరి సమష్టి కృషి. భారత్‌ ఇన్నింగ్స్‌లో తొందరగా వికెట్లు తీయడం వల్ల మాకు కలిసిరావడంతో పాటు మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడింది. మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పక్కా ప్రణాళికలతో ఫలితాన్ని రాబట్టాము. ఓపెనర్లం భారీ స్కోర్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్‌ చివరి వరకు ఉండాలని నిర్ణయించుకున్నాం. భారత్‌ను ఓడించడం అంత సులభం కాదు. అనుకున్నట్లే చేసి ఫలితం రాబట్టాం. ఈ విజయంతో మాకు మరింత ఆత్మవిశ్వాసం కలిగింది. ఈ ఆత్మవిశ్వాసాన్ని మిగతా మ్యాచ్‌లకు అలాగే కొనసాగిస్తాం. ఈ మ్యాచ్‌కు ముందు మీము బాగా సన్నద్ధం అయ్యాము. భారత్‌పై గెలిచి చరిత్ర సృష్టించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. దేశీయ మ్యాచ్‌ల వల్ల మాకు ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని అని బాబర్‌ అన్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని