CWG 2022: మీరాబాయి చానూనే నాకు స్ఫూర్తి: పాక్‌ ఛాంపియన్

భారత వెయిట్‌లిఫ్టర్‌, ఒలింపిక్స్‌ పతక విజేత మీరాబాయి చాను తనకు స్ఫూర్తిగా నిలిచారని పాకిస్థాన్‌ వెయిట్‌లిఫ్టర్‌ నూహ్‌ దస్తగిర్‌ బట్‌ పేర్కొన్నాడు....

Updated : 04 Aug 2022 21:30 IST

బర్మింగ్‌హామ్‌: భారత వెయిట్‌లిఫ్టర్‌, ఒలింపిక్స్‌ పతక విజేత మీరాబాయి చాను తనకు స్ఫూర్తిగా నిలిచారని పాకిస్థాన్‌ వెయిట్‌లిఫ్టర్‌ నూహ్‌ దస్తగిర్‌ బట్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల 109+ కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మొత్తం 405 కేజీల బరువెత్తి (స్నాచ్‌ 173 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌ 232 కేజీలు) కొత్త రికార్డు సృష్టించడమే కాకుండా పాక్‌ తరఫున తొలి స్వర్ణం సాధించాడు. ఈ నేపథ్యంలోనే పీటీఐతో మాట్లాడిన అతడు మీరాబాయి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీడబ్ల్యూజీలో తాను పసిడి ముద్దాడగానే మీరాబాయి ప్రత్యేకంగా అభినందించారని, అది తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నాడు.

‘కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన నాకు మీరాబాయి తొలుత ప్రశంసించడం గర్వకారణంగా ఉంది. ఆమె నా ప్రదర్శనను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె నాకు స్ఫూర్తిగా నిలిచారు. దక్షిణ ఆసియా దేశాల్లోని అథ్లెట్లు కూడా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగలమనే నమ్మకాన్ని మీరాబాయి కలిగించారు. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రజతం గెలవగానే నేనెంతో సంతోషించా. అలాగే ఈ పోటీల్లో కాంస్యం గెలిచిన భారత వెయిట్‌ లిఫ్టర్‌ గుర్‌దీప్‌ సింగ్‌తోనూ నాకు మంచి అనుబంధం ఉంది. మేమిద్దరం చాలా కాలంగా స్నేహితులం. పలుమార్లు మేమిద్దరం విదేశాల్లో ఒకే చోట శిక్షణ పొందాం. ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం. అలాగే, నేనెప్పుడూ అతడిని పోటీగా భావించలేదు. అతడు భారత వెయిట్‌ లిఫ్టర్‌ అని, ప్రత్యర్థి అని అనుకోలేదు. ఏ ఈవెంట్‌లోనైనా నేను అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే అనుకుంటా’ అని దస్తగిర్‌ బట్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని