IND vs ENG: మరో 70-80 పరుగులు చేయాల్సింది.. బౌలింగ్‌లో మా వ్యూహాలు మార్చుకోవాలి: ద్రవిడ్

తొలి టెస్టులో టీమ్‌ఇండియా (IND vs ENG) ఓటమికిగల కారణాలను కోచ్‌ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను అభినందిస్తూనే.. జట్టులోని లోపాలను తెలియజేశాడు.

Updated : 29 Jan 2024 13:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్నా.. టీమ్‌ఇండియాకు (IND vs ENG) ఓటమి మాత్రం తప్పలేదు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 202 పరుగులకే భారత్‌ ఆలౌటైంది. ఈ పరాజయానికి కారణాలను ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ విశ్లేషించాడు.

‘‘తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు 80ల్లోనే ఔటయ్యారు. సెంచరీలు చేసే అవకాశం చేజార్చుకున్నారు. కనీసం మరో 70 పరుగులు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడే ఇంకాస్త బాగా ఆడాల్సింది. కొన్ని మంచి ఆరంభాలు దక్కినా  సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఒక్క బ్యాటరైనా భారీ శతకం చేసి ఉంటే ఇంగ్లాండ్‌పై మరింత ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం దక్కేది. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం ఎప్పుడూ సవాలే. 230 పరుగులే అయినా చాలా కష్టం. 

మా జట్టులో యువ క్రికెటర్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అంతర్జాతీయంగా నేర్చుకోవడానికి వారికి ఇంకాస్త సమయం అవసరం. ఇలాంటి సవాళ్లను వారు ఎదుర్కోలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. వారిలోని నైపుణ్యాలకు ఇది పరీక్ష. తప్పకుండా భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా.

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఓలీ పోప్‌ (196) అద్భుతంగా ఆడాడు. నాణ్యమైన భారత బౌలింగ్‌లో.. ఇలాంటి పిచ్‌ పరిస్థితుల్లో స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లతో పరుగులు రాబట్టాడు. అతడి బ్యాటింగ్‌కు తగ్గట్టుగా బౌలింగ్‌లో వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అతడి విషయంలో మా బౌలర్లు అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోయారు. తదుపరి మ్యాచ్‌లో ఈ లోపాలను సరిచేసుకుని బరిలోకి దిగుతాం. మా ప్రణాళికలు సరైనవి అయితే.. అతడు (పోప్‌) పొరపాట్లు చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది’’ అని ద్రవిడ్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని