బజ్‌రంగ్‌పై వేటు

స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియాను జాతీయ డోపింగ్‌ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్‌ చేసింది. ఇటీవల ట్రయల్స్‌ సందర్భంగా డోప్‌ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 06 May 2024 02:51 IST

నమూనా ఇవ్వనందుకు సస్పెండ్‌ చేసిన నాడా

దిల్లీ: స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియాను జాతీయ డోపింగ్‌ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్‌ చేసింది. ఇటీవల ట్రయల్స్‌ సందర్భంగా డోప్‌ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై తమకు సమాచారమివ్వనందుకు నాడాపై భారత రెజ్లింగ్‌ సంఘం (డబ్ల్యూఎఫ్‌ఐ) మండిపడింది. దీనిపై ప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా)కు లేఖ రాయాలని భావిస్తోంది. బజ్‌రంగ్‌ను నాడా ఏప్రిల్‌ 23నే సస్పెండ్‌ చేసింది. తదుపరి క్రమశిక్షణ చర్యలు తప్పించుకునేందుకు మే 7 లోపు జవాబివ్వాలని రెజ్లర్‌ను ఆదేశించింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు జాతీయ జట్టును ఎంపిక చేసేందుకు మార్చి 10న సోనేపట్‌లో ట్రయల్స్‌ జరిగాయి. ఆ ట్రయల్స్‌లో ఓటమి అనంతరం బజ్‌రంగ్‌ శాంపిల్‌ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. సస్పెన్షన్‌పై బజ్‌రంగ్‌ స్పందిస్తూ.. ‘‘నాడా అధికారులకు నమూనా ఇవ్వడానికి నేనెప్పుడూ తిరస్కరించలేదు. గతంలో గడువు ముగిసిన కిట్‌తో నమూనా సేకరణ కోసం నా దగ్గరకు వచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నాడాకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని చెప్పాడు. వాడా నిబంధనల ప్రకారం నమూనా ఇవ్వడానికి తిరస్కరించడం నిబంధనల ఉల్లంఘనే. మరోవైపు పునియా సస్పెన్షన్‌పై నాడా తమకు సమాచారం ఇవ్వలేదంటూ భారత రెజ్లింగ్‌ సంఘం (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘సస్పెన్షన్‌ విషయమే నాడా మాకు చెప్పకపోవడం ఆశ్చర్యకరం. నాడా డీజీ, ఇతర అధికారులతో ఏప్రిల్‌ 25న సమావేశమయ్యా. వివిధ అంశాలపై నాడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ బజ్‌రంగ్‌ సస్పెన్షన్‌పై మాత్రం చెప్పలేదు. ఉదయం నాడా అధికారులతో మాట్లాడా. నా ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఇప్పుడు నేను వాడాకు లేఖ రాయాలనుకుంటున్నా. అందులో నాడా గురించి చెబుతా’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని