IPL-2022 : ముంబయికి చేరుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.!

ఈ సారి ఐపీఎల్ సందడి కాస్త ముందుగానే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలు జట్లు సన్నాహకాలు ప్రారంభించాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేసిన ట్రెయినింగ్‌ క్యాంపులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు..

Published : 15 Mar 2022 18:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఈ సారి ఐపీఎల్ సందడి కాస్త ముందుగానే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలు జట్లు సన్నాహకాలు ప్రారంభించాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేసిన ట్రెయినింగ్‌ క్యాంపులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చెన్నైలో క్యాంపు ఏర్పాటు చేసింది. ఇటీవల రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆటగాళ్లు కూడా ముంబయికి చేరుకున్నారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌తో పాటు ఈ సారి వేలం ద్వారా కొత్తగా జట్టులోకి వచ్చిన యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్ సైని, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కరుణ్‌ నాయర్‌ తదితర ఆటగాళ్లకు రాజస్థాన్‌ జట్టు యాజమాన్యం సంప్రదాయ రీతిలో స్వాగతం పలికింది. ఆ ఫొటోలను ట్విటర్లో పంచుకుంది.

* ప్రాక్టీస్ మొదలెట్టిన ముంబయి ఇండియన్స్‌..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ జట్టు కూడా.. నవీ ముంబయి సమీపంలోని ‘రిలయన్స్‌ జియో’ స్టేడియంలో ప్రాక్టీస్‌ ప్రారంభించింది. తొలి రోజు ట్రెయినింగ్‌లో భాగంగా ముంబయి జట్టు డైరెక్టర్‌ జహీర్ ఖాన్‌, కోచ్‌ మహేల జయవర్ధనె నేతృత్వంలో ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌పై అనాలిసిస్‌ చేశారు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ ముగిసిన అనంతరం ముంబయి కెప్టెన్‌ రోహిత్ శర్మ, పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరారు. మరోవైపు, ఇన్నాళ్లు బెంగళూరులోని ఎన్సీఏ రిహాబిలిటేషన్‌ క్యాంపులో ఉన్న యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి జట్టుకి అందుబాటులోకి వచ్చాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని