PCB: రెస్ట్‌ ఇన్‌ పీస్.. అంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల కాలంలో పాక్‌ క్రికెట్‌ (PCB) బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్‌ అయితే తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు.

Published : 15 Mar 2023 19:52 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తీసుకున్న ఓ నిర్ణయంపై ఆ జట్టు మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు (PAK vs AFG) రెగ్యులర్ సారథి బాబర్ అజామ్‌తోపాటు ఫాస్ట్‌ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవసరం లేకపోయినా విశ్రాంతినిచ్చి పీసీబీ జట్టును ప్రకటించింది. ఇదే నిర్ణయం.. అఫ్గాన్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రషీద్‌ లతీఫ్‌కు ఆగ్రహం తెప్పించింది. పీసీబీ కొత్త ఛైర్మన్‌ నజామ్ సేథి మార్గదర్శకంలో పాకిస్థాన్‌ క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరుతుందనే అభిప్రాయంతో ఉన్న మాజీలకు ఇటీవల పీసీబీ తీసుకుంటున్న నిర్ణయాలు మింగుడుపడటం లేదు. ఇప్పుడు ఏకంగా రషీద్‌ లతీఫ్‌ వంటి క్రికెట్‌ దిగ్గజం కూడా ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ అంటూ పాక్‌ క్రికెట్‌పై కామెంట్ చేశాడు. 

షాదాబ్‌ ఖాన్‌ నాయకత్వంలోని పాక్‌ జట్టు మార్చి 25 నుంచి యూఏఈ వేదికగా అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20లను ఆడనుంది. సీనియర్లు బాబర్ అజామ్‌, షహీన్‌కు విశ్రాంతినిచ్చారు . దీంతో లతీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన ఆటగాళ్లు చాలా రోజుల తర్వాత ఐసీసీ ర్యాంకులు, అవార్డులను గెలుచుకున్నారు. బాబర్, షహీన్ ఐసీసీ అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే, ఇది పీసీబీకి నచ్చడం లేదేమో. ఇలాంటిది మరెప్పుడూ జరగకుండా చూస్తామన్నట్లుగా పీసీబీ వ్యవహారశైలి ఉంది. డెబ్బయ్యో.. ఎనభయ్యో ఉన్నవారికి (నజామ్‌ సేథినుద్దేశించి) విశ్రాంతి అవసరం. వీరు పాకిస్థాన్‌ క్రికెట్‌ తలరాతను నిర్ణయిస్తారట. ఇప్పుడు పాక్‌ క్రికెట్ చావు బతుకుల్లో ఉంది. అందుకే రెస్ట్‌ ఇన్‌ పీస్‌ పాక్‌ క్రికెట్‌ అని చెబుతున్నా. అఫ్గాన్‌తో కొత్త ప్లేయర్లను తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న జట్టు కాంబినేషన్‌ను మార్చివేశారు. అఫ్గాన్‌ సిరీస్‌లో వారు రాణించినా.. సీనియర్ల కోసం మళ్లీ పక్కన పెట్టేస్తారు. అందుకే, మీడియా కూడా ఇలాంటి వాటిపై దృష్టిపెట్టాలి. పాకిస్థాన్‌ క్రికెట్‌ నాశనం కావడానికి ఇదే తొలి మెట్టు అవుతుంది’’ అని రషీద్‌ లతీఫ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని