Suryakumar Yadav : సూర్యా మూడు ఫార్మాట్ల ఆటగాడు.. మెచ్చుకున్న శాస్త్రి.. లైక్‌ చేసిన కోహ్లీ

టెస్టు క్రికెట్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌ గురించి పెద్దగా మాట్లాడరని రవి శాస్త్రి అన్నాడు. అయితే.. అతడు టెస్టులూ ఆడగలడని పేర్కొన్నాడు.

Updated : 29 Oct 2022 12:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  టీ20 ప్రపంచకప్‌ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌(51 నాటౌట్‌; 25 బంతుల్లో 7×4, 1×6) చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీతో కలిసి 48 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌ అనంతరం మాజీ కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ అతడి ఆటతీరును మెచ్చుకున్నాడు. టెస్టులూ ఆడగలడని మద్దతిస్తూ.. అతడిని మూడు ఫార్మాట్ల ప్లేయర్‌ అని కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తాజాగా పంచుకుంది.

‘సూర్యా మూడు ఫార్మాట్ల ఆటగాడని నేను అనుకుంటున్నా. టెస్టు క్రికెట్‌లో అతడి గురించి పెద్దగా మాట్లాడరని నాకు తెలుసు. అతడు టెస్టులూ ఆడగలడు. ఐదో నంబర్‌ స్థానంలో అతడిని పంపించండి.. కొందర్ని ఆశ్చర్యపరుస్తాడు’ అని శాస్త్రి మెచ్చుకున్నాడు. దీనికి సూర్య స్పందిస్తూ.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరగేంట్రం చేసిన సందర్భంగా శాస్త్రి చెప్పిన  మాటలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నా అరగేంట్ర మ్యాచ్‌కు ముందు శాస్త్రి నన్ను పిలిచారు. వెళ్లు.. బిందాస్‌గా ఆడు అంటూ ప్రోత్సహించారు. ఆ మాటలు నాకింకా గుర్తున్నాయి’ అని చెప్పాడు.

ఐసీసీ పంచుకున్న ఈ వీడియోకు పరుగుల వీరుడు కింగ్‌ కోహ్లీ లైక్‌ కొట్టి.. శాస్త్రి అభిప్రాయాలకు మద్దతు తెలిపాడు. ఇక, రెండు వరుస విజయాలతో జోరుమీదున్న రోహిత్‌ సేన ఈ ప్రపంచకప్‌లో తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని