IPL 2023: వారికి అవకాశాలు ఇవ్వాలి.. అప్పటికైనా సిద్ధం చేయాలి: మాజీ క్రికెటర్లు

ఐపీఎల్‌లో (IPL 2023) సత్తా చాటుతూ భారత జట్టులోకి వచ్చేందుకు యువ క్రికెటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది. 

Published : 12 May 2023 18:17 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్లు హాట్‌ టాపిక్‌గా మారారు. ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని బాదిన రాజస్థాన్‌ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతాను గెలిపించిన రింకు సింగ్‌ అద్భుత ఫామ్‌తో కొనసాగుతున్నారు. రుతురాజ్‌,  శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్.. కూడా ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. కానీ, వీరంతా టీమ్‌ఇండియాకు సెలెక్ట్‌ అయినవాళ్లే. యశస్వి, రింకు సింగ్‌ మాత్రం తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి దూకుడుగా ఆడటంతో సెలెక్టర్లు దృష్టి సారించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కోల్‌కతాపై యశస్వి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (13 బంతుల్లోనే) సాధించిన నేపథ్యంలో.. టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో యశస్వి జైస్వాల్ (575 పరుగులు) ఆరెంజ్‌ క్యాప్‌ సాధించడానికి డుప్లెసిస్‌తో (576 పరుగులు) పోటీ పడుతుండగా.. రింకు సింగ్ (353 పరుగులు) కూడా మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

వారిద్దరిపై కన్నేయాలి: రవిశాస్త్రి

‘‘స్వదేశం వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌పై టీమ్‌ఇండియా దృష్టిసారిస్తే.. యశస్వి, రింకు సింగ్‌ వంటి యువ క్రికెటర్లపైనా ఓ కన్నేయాలి. ఇలాంటి ఆటగాళ్లు దూకుడుగా ఆడతారు. ఇలాంటి వారిని వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలి. అప్పటికి జాతీయ జట్టులో ఉంటే అనుభవం వస్తుంది. ఒకవేళ వారిద్దరిని తీసుకోకపోతే.. సెలెక్టర్లు ఇంకేదైనా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాటలో ఉన్నారేమో నాకు తెలియదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. 

తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టాడు: హర్భజన్‌

‘‘యశస్వి జైస్వాల్ తనప్రదర్శనతో భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చేందుకు తలుపు కొట్టడం కాదు.. ఏకంగా బద్దలు కొట్టినట్లు ఉంది. అతడి నిలకడైన బ్యాటింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని తన వైపు తిప్పేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కనబరిచిన ఫామ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు జాతీయ జట్టులో అవకాశం కోసం మార్గం వేసుకున్నాడు. అద్భుతమైన టాలెంట్‌ కలిగిన యశస్విని భారత క్రికెట్‌కు భవిష్యత్తు తార అనడంలో సందేహం లేదు’’ అని హర్భజన్ తెలిపాడు. 

వెంటనే సెలెక్ట్‌ చేసేస్తా: సురేశ్ రైనా

‘‘నేనే భారత జట్టు సెలెక్టర్‌ను అయితే వెంటనే యశస్విని జాతీయ జట్టులోకి తీసుకుంటా. వన్డే ప్రపంచ కప్‌లో ఆడిస్తా. వీరేంద్ర సెహ్వాగ్‌ను మళ్లీ గుర్తుకు తెచ్చాడు. రోహిత్ శర్మ కూడా ఇలాంటి యువ బ్యాటర్ల కోసం చూస్తుంటాడని నేను భావిస్తున్నా’’ అని సురేశ్‌ రైనా అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని