Team India: అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి.. వారికీ సమయం ఇవ్వండి: అశ్విన్‌

పుష్కర కాలం కిందట టీమ్‌ఇండియా (Team India) వన్డే ప్రపంచ కప్‌ను (ODI World Cup) గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారీ కూడా కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఈ ఏడాది భారత్‌ వేదికగానే వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది.

Published : 30 Jan 2023 20:49 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత అభిమానులు కాస్త ఓర్పుగా ఉండాలంటున్నాడు సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌. అసలు ఎందుకు ఇలా అన్నాడంటే..? 2011 తర్వాత జరిగిన వన్డే ప్రపంచకప్‌లు, టీ20 వరల్డ్‌ కప్‌ల్లో టీమ్‌ఇండియా విజేతగా నిలవలేకపోయింది. చివరిసారిగా ఐసీసీ టోర్నీల్లో 2013లో ధోనీ సారథ్యంలో ఛాంపియన్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి విరాట్ కోహ్లీ నాయకత్వంలోనూ, ఆ తర్వాత ఇప్పుడు రోహిత్‌ శర్మ కెప్టెన్సీల్లోనూ కప్‌ను అందుకోలేకపోయింది. దీంతో సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ ఏడాది ఆసియా కప్‌తోపాటు వన్డే ప్రపంచకప్‌ జరగనున్నాయి. అదీ స్వదేశంలోనే వరల్డ్‌ కప్‌ ఉండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అశ్విన్‌ తన యూ ట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘అభిమానులు కాస్త ఓపికగా ఉండాలి. బయట నుంచి అది గెలవలేదు.. ఇది గెలవలేదు అని చెప్పడం చాలా సులువు’’ అని వ్యాఖ్యానించాడు. 

‘‘కపిల్‌ సారథ్యంలో 1983లో భారత్‌ తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఏకంగా ఆరు ప్రపంచకప్‌లు (1992, 1996, 1999, 2003, 2007, 2011) ఆడాడు. చివరిగా 2011లో కప్‌ను అందుకొన్నాడు. కప్‌ను ముద్దాడటానికి ఆరు ప్రపంచకప్‌లు వేచి చూడాల్సి వచ్చింది. దీనికి కారణం ఎంఎస్ ధోనీ. అతడు కెప్టెన్‌గా వచ్చిన కొన్నాళ్లకే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు. ఇలా అందరికీ జరుగుతుందని కాదుకదా.. ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా విఫలం కావడం గత పదేళ్ల నుంచి జరుగుతోంది. దీంతో విమర్శలు పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా ఇటీవల ఆసీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర ఓటమి తర్వాత మరీ ఎక్కువైంది’’ 

‘‘విరాట్, రోహిత్ శర్మకు కాస్త సమయం ఇవ్వాలి. వారిద్దరూ 2007 వన్డే ప్రపంచకప్‌లో ఆడలేదు. రోహిత్ 2011లోనూ మిస్‌ కాగా.. విరాట్ 2011, 2015, 2019 టోర్నీల్లో ఆడాడు. ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌ అతడికి నాలుగోది. అతడు కూడా ఐసీసీ ట్రోఫీని గెలవలేదని చెబుతుంటారు. అయితే 2011లోనే విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడు. అలాగే 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీను కూడా అందుకొన్నాడు. రోహిత్ శర్మ కూడా 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచిన జట్టులో ఉన్నాడు. అందుకే వారిద్దరికి సమయం ఇవ్వాలి. ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్‌, ఇతర మ్యాచుల్లో ఆడారు’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని