IND vs SA: పంత్‌పై కెప్టెన్సీ ప్రభావం.. అతడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సునీల్ గావస్కర్

అనుకోకుండా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రిషభ్ పంత్‌కు తొలి సిరీస్‌లోనే కఠిన పరీక్ష ఎదురైంది. అతని సారథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఓటమిపాలైంది.

Updated : 15 Jun 2022 12:39 IST

ఇంటర్నెట్ డెస్క్: అనుకోకుండా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రిషభ్ పంత్‌కు తొలి సిరీస్‌లోనే కఠిన పరీక్ష ఎదురైంది. అతని సారథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఓటమిపాలైంది. వైజాగ్ వేదికగా నిన్న జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. సిరీస్‌ను చేజిక్కించుకోవాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో కూడా భారత్ విజయాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. పంత్‌ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే టీమ్‌ఇండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. అతడు బ్యాటింగ్‌లో కూడా ఇంతకుముందులా రాణించట్లేదు. తొలి టీ20లో 16 బంతుల్లో 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్‌ ఆటతీరుపై భారత మాజీ బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ మాట్లాడారు. కెప్టెన్‌ తన ప్రదర్శన కంటే సహచర ఆటగాళ్ల ఆటతీరు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడని, కొన్నిసార్లు నాయకత్వ బాధ్యతలు కెప్టెన్‌ ఆటతీరుపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. 

‘గత మూడు నాలుగు సంవత్సరాలుగా రిషభ్ పంత్‌ దూకుడైన ఆటతీరుతో అలరించాడు. ఆ ప్రదర్శనల కారణంగా పంత్‌ క్రీజులోకి రాగానే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడతాడని అభిమానులు ఆశించారు. కానీ, వారికి నిరాశ ఎదురైంది. అతడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కెప్టెన్సీలో తరచుగా జరిగేది ఏమిటంటే.. కెప్టెన్‌లు తమ ఆట గురించి ఆలోచించరు. ఇతర ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఆలోచిస్తారు. దీంతో వారు (కెప్టెన్‌లు) తమ బ్యాటింగ్‌లో ఏదో సాంకేతిక సమస్య ఉందని లేదా బ్యాటింగ్‌ చేసే విధానంలో లోపం ఉందనే విషయాన్ని మార్చిపోతారు. పంత్‌ విషయంలో కూడా ఇదే జరిగి త్వరగా ఔట్‌ అవుతున్నాడు’అని గావస్కర్ వివరించారు. మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో పంత్‌కు ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ‘అతనికి ఇప్పుడు రెండు రోజుల సమయం ఉంది. మొదటగా భారత్ గెలిచినందుకు పంత్‌ చాలా సంతోషంగా ఉంటాడు. అతడిపై కొంచెం ఒత్తిడి తగ్గింది. టీమ్‌ఇండియా ఇంకా రెండు మ్యాచ్‌లు గెలవాలి.  పంత్‌ ఇప్పుడు తన సొంత బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి’ అని గావస్కర్ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని