Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు

కెరీర్‌ ఆరంభంలో రిషబ్‌ పంత్‌ ఆట చూసి అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే బాగా సరిపోతాడని అంతా అనుకున్నారు. కానీ సెహ్వాగ్‌లా అతను వన్డేలు, టీ20లను మించి టెస్టుల్లో ఎక్కువ విజయవంతం...

Updated : 02 Jul 2022 08:30 IST

కెరీర్‌ ఆరంభంలో రిషబ్‌ పంత్‌ ఆట చూసి అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే బాగా సరిపోతాడని అంతా అనుకున్నారు. కానీ సెహ్వాగ్‌లా అతను వన్డేలు, టీ20లను మించి టెస్టుల్లో ఎక్కువ విజయవంతం అవుతుండటం, తరచుగా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతుండటం విశేషం. విదేశాల్లో కఠిన పిచ్‌లపై ప్రత్యర్థి పేసర్ల ధాటికి తాళలేక టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆపసోపాలు పడి వెనుదిరగడం.. పంత్‌ వచ్చి బ్యాట్‌ ఝుళిపిస్తూ స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం.. జట్టుకు ఆపద్బాంధవుడిగా మారడం.. ఈ దృశ్యాలు తరచుగా చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో గతంలో అతనాడిన మేటి ఇన్నింగ్స్‌ల గురించి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్రదర్శనతో మరోసారి పంత్‌ తన విలువను చాటిచెప్పాడు. 71/4తో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి అడుగుపెట్టిన రిషబ్‌.. మ్యాచ్‌ గమనంతో సంబంధం లేకుండా మరోసారి తన సహజ శైలిలో చెలరేగి జట్టును మంచి స్థితికి చేర్చాడు. అతను వచ్చిన కాసేపటికే శ్రేయస్‌ కూడా ఔటవడంతో భారత్‌ 98/5తో మరింత ఇబ్బందుల్లో పడింది. అయినా అతను వెరవలేదు. ఇంగ్లిష్‌ బౌలర్లందరి మీదా ఎదురు దాడి చేశాడు. న్యూజిలాండ్‌తో చివరి టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన లీచ్‌నైతే అతను లెక్కే చేయలేదు. అతడిని గల్లీ బౌలర్‌లా మార్చేస్తూ.. పదే పదే ముందుకొచ్చి షాట్లు ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాడు. కొన్నిసార్లు అవసరం లేని సాహసాలు చేసినట్లు అనిపించినా.. పంత్‌ ఆట మాత్రం అభిమానులను అమితంగా అలరించడమే కాక, భారత జట్టును పెద్ద ప్రమాదం నుంచి బయట పడేసింది. అతనిలా ఆడకుంటే తొలి రోజే మ్యాచ్‌పై భారత్‌ ఆశలు వదులుకోవాల్సి వచ్చేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని