Updated : 22 May 2022 11:41 IST

Rishabh Pant: టిమ్‌ డేవిడ్‌పై రివ్యూ ఎందుకు తీసుకోలేదంటే..? పంత్‌ వివరణ

(Photo: Rishabh Pant Instagram)

ముంబయి: ముంబయితో జరిగిన అత్యంత కీలక పోరులో దిల్లీ చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్‌లో తడబడిన ఆ జట్టు తర్వాత బౌలింగ్‌లోనూ విఫలమైంది. ఇక్కడ దిల్లీ జట్టుగా ఓడిందని చెప్పడం కంటే.. కెప్టెన్సీ పరంగా రిషభ్ పంతే విఫలమయ్యాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్లేఆఫ్స్‌ చేరాల్సిన ఆ జట్టు ఖాళీ చేతులతో ఇంటిముఖం పట్టింది. తొలుత ముంబయి బౌలర్లు రెచ్చిపోవడంతో దిల్లీ 50/4తో నిలిచి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కాస్త నెమ్మదిగా ఆడిన పంత్‌ (39; 33 బంతుల్లో 4x4, 1x6) కీలక సమయంలో దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ కీపర్‌ చేతికి చిక్కాడు.

ఇక ముంబయి ఇన్నింగ్స్‌లో దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసే ప్రయత్నం చేసినా.. పంత్‌ తప్పిదాల వల్లే మ్యాచ్‌ను కోల్పోయింది. తొలుత కుల్‌దీప్‌ బౌలింగ్‌లో డివాల్డ్‌ బ్రేవిస్‌ (37; 33 బంతుల్లో 1x4, 3x6) ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ జారవిడిచాడు. ఇక శార్దూల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన డేవిడ్‌.. ఆడిన తొలి బంతి బ్యాట్‌ను ముద్దాడి పంత్‌ చేతిలో పడింది. అప్పీల్‌ చేస్తే అంపైర్‌ నాటౌటిచ్చాడు. కానీ పంత్‌ అనుమానంతో సమీక్ష కోరలేదు. అయితే, రీప్లేలో ఆ బంతి బ్యాట్‌ అంచును తాకుతూ వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత డేవిడ్‌ సిక్సర్లతో చెలరేగి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక తిలక్‌ వర్మ (21; 17 బంతుల్లో 1x4, 1x6) ఎల్బీడబ్ల్యూ విషయంలో పంత్‌ సమీక్ష కోరినా అది వృథా అయింది. దీంతో ఎటు చూసినా ఈ మ్యాచ్‌లో పంత్‌ నాయకత్వ లోపంతోనే మ్యాచ్‌ను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది.

కాగా, మ్యాచ్‌ అనంతరం టిమ్‌ డేవిడ్‌ విషయంలో ఎందుకు సమీక్ష కోరలేదో పంత్‌ వివరణ ఇచ్చాడు. ‘డేవిడ్‌ ఆడిన తొలి బంతి బ్యాట్‌కు తాకినట్లు నాకు అనిపించింది. కానీ, సర్కిల్‌లో ఉన్న ఆటగాళ్లు పెద్దగా స్పందించలేదు. దీంతో సమీక్షకు వెళ్లాలా.. వద్దా? అని వాళ్లను అడిగాను. చివరికి నేను సమీక్ష కోరలేదు’ అని దిల్లీ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసే టిమ్‌ డేవిడ్‌ లాంటి విధ్వంసకర ఆటగాడి విషయంలో అనుమానం ఉన్నప్పుడు కచ్చితంగా రివ్యూకు వెళ్లాల్సిందే అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్పటికీ దిల్లీ వద్ద రెండు రివ్యూలు ఉన్నాయి. అయినా పంత్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని