Rishahb Pant: అది కరెక్ట్‌ కాదు కానీ.. మాక్కూడా అన్యాయం జరిగింది: పంత్

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో నోబాల్‌ వివాదంపై దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ తాము ప్రవర్తించిన తీరు కచ్చితంగా సరైందని కాదన్నాడు...

Published : 23 Apr 2022 11:43 IST

(Photo: Rishabh Pant Instagram) 

ముంబయి‌: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో నోబాల్‌ వివాదంపై దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ తాము ప్రవర్తించిన తీరు కచ్చితంగా సరైంది కాదని ఒప్పుకొన్నాడు. అయితే, తమకు కూడా అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చాడు. 223 పరుగుల భారీ ఛేదనలో దిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమైన మేళ రోమన్‌ పావెల్‌ (36) వరుసగా మూడు సిక్సర్లు కొట్టి దిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మూడో బంతి నోబాల్‌లా కనిపించినా అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కాసేపు వివాదం తలెత్తి మ్యాచ్‌ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే పంత్‌ తమ ఆటగాళ్లను వెనక్కి వచ్చేయమని చెప్పడం, సహాయక కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడటం జరిగింది. దీంతో ఇదంతా పెను దుమారం రేపింది.

‘అంపైర్ల తీరుతో నిరాశకు గురయ్యా. ఆ బంతి చాలా స్పష్టంగా నోబాల్‌లా కనపించింది. అయితే అంపైర్లు స్పందించిన తీరుపై మేమంతా ఆగ్రహానికి లోనయ్యాం. అప్పుడు థర్డ్‌ అంపైర్‌ కలగజేసుకొని దాన్ని నోబాల్‌గా ప్రకటించాల్సింది. నేను ఒక్కడినే నియమాలు మార్చలేను కదా’ అని పంత్‌ వివరించాడు. అలాగే ఆమ్రెను మైదానంలోకి పంపడం సరైన పనేనా అని అడిగిన ప్రశ్నకు.. కచ్చితంగా కాదన్నాడు. కానీ, తమకు కూడా అన్యాయం జరిగిందని దిల్లీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. క్షణికావేశంలో అలా జరిగిపోయిందని, దాని గురించి చేయాల్సిందేం లేదన్నాడు. అనంతరం ఇదే విషయంపై రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ స్పందిస్తూ.. బంతి ఫుల్‌టాస్‌ పడటంతో అది సిక్సర్‌గా వెళ్లిందని, దాంతో అంపైర్‌ సరైన నిర్ణయమే తీసుకొని దానికి కట్టుబడి ఉన్నాడని చెప్పాడు. కానీ, దిల్లీ బ్యాట్స్‌మన్‌ దాన్ని నోబాల్‌గా పరిగణించాలని కోరారన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని