Sachin Tendulkar: అందుకే మాస్టర్‌ ‘బ్లాస్టర్‌’ అయ్యాడు.. తన బ్యాటింగ్‌తో నవ శకానికి నాంది పలికాడు

క్రికెట్‌లో ఎదురులేని ఆటగాడు‌. తన బ్యాటింగ్‌తో క్రికెట్‌కే వన్నె తెచ్చిన ధీరుడు. క్రిజులో అడుగెడితే పేరు మోసిన బౌలర్లకే చెమటలు పట్టించిన ఘనుడు. ప్రపంచంలోనే ఎంతో మంది...

Published : 25 Feb 2022 01:42 IST

క్రికెట్‌లో ఎదురులేని ఆటగాడు‌. తన బ్యాటింగ్‌తో క్రికెట్‌కే వన్నె తెచ్చిన ధీరుడు. క్రీజులో అడుగు పెడితే ఏ బౌలర్‌కైనా చెమటలు పట్టించగల ఘనుడు. ప్రపంచంలోనే ఎంతో మంది యువతకు ఆటను కెరీర్‌గా ఎంచుకునే మార్గం చూపించిన ఆరాధ్యుడు. అసాధ్యం అనుకున్న రికార్డులు సుసాధ్యం చేసిన అనితర సాధ్యుడు. అతడే సచిన్‌ తెందూల్కర్‌. ఆటగాడిగా ఎంత గొప్ప పేరున్నా.. మాస్టర్‌ ‘బ్లాస్టర్‌’గా మారి వన్డేల్లో తొలి ద్విశతకం సాధించిన క్షణాలే మధురమైనవి. సచిన్‌ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలవడమే కాదు.. ఆ రికార్డుకు గేట్లు తెరిచిన బ్యాట్స్‌మన్‌గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఇది జరిగి 12 ఏళ్లు గడిచిన సందర్భంగా ఒకసారి నాటి ఇన్నింగ్స్‌ గుర్తు చేసుకుందాం.

స్కోర్‌ 401.. గెలిచిన తేడా 153..

అది 2010 ఫిబ్రవరి 24. గ్వాలియర్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా వన్డే మ్యాచ్‌. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ అయ్యాక ఈ స్కోర్‌ చూసిన ప్రతి ఒక్కరికీ టీమ్‌ఇండియా విజయం ఖాయమనే సంగతి అర్థమైంది. అయితే, ఎంత తేడాతో గెలుస్తుందనే ఆసక్తే మిగిలి ఉంది. చివరికి అందరూ ఊహించినట్లే దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. ఆ జట్టు 42.5 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఫలితం టీమ్‌ఇండియా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సెహ్వాగ్‌ మినహా.. అంతా దంచికొట్టుడే..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (9) నాలుగో ఓవర్‌లో వెనుదిరిగాడు. అప్పటికి సచిన్‌ 16 పరుగులతో ఉన్నాడు. ఆపై క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (79; 85 బంతుల్లో 4x4, 3x6), తెందూల్కర్‌తో కలిసి బాధ్యతాయుతంగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏ అవకాశం ఇవ్వకుండా ఇద్దరూ నిలకడగా కొనసాగారు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూనే తొలుత అర్ధ శతకాలు సాధించారు. ఆపై సెంచరీల వైపు పరుగెత్తారు. ఈ క్రమంలోనే సచిన్‌ శతకం సాధించగా.. కార్తీక్‌ సైతం ఆ దిశగానే అడుగులు వేశాడు. కానీ, రెండో వికెట్‌కు 194 పరుగులు జోడించాక అతడు ఔటయ్యాడు. జట్టు స్కోర్‌ 219 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. ఆపై యూసుఫ్‌ పఠాన్‌ (36; 23 బంతుల్లో 4x4, 2x6) క్రీజులోకి రాగానే ఎడా పెడా బౌండరీలు బాదాడు. దీంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు సచిన్‌ కూడా ధాటిగా ఆడాడు. దీంతో వీరిద్దరూ 47 బంతుల్లోనే మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే, జట్టు స్కోర్‌ 300 చేరాక యూసుఫ్‌ వెనుదిరిగాడు. అప్పటికి సచిన్‌ (168) పరుగులతో ఉన్నాడు.

ఆ తొమ్మిది ఓవర్ల ఆటే హైలైట్‌..

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (68; 35 బంతుల్లో 7x4, 4x6) చివరి 9 ఓవర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సచిన్‌ కూడా ఎలాగైనా చివరి బంతివరకూ క్రీజులో ఉండాలని పట్టుదలగా నిలిచాడు. ఈ క్రమంలోనే మాస్టర్‌ బ్లాస్టర్‌ తన వ్యక్తిగత రికార్డు స్కోర్‌ (186) పరుగులను దాటాడు. కాసేపటికే 46వ ఓవర్‌లో పాకిస్థాన్‌ మాజీ బ్యాటర్‌ సయీద్‌ అన్వర్‌, జింబాబ్వే చార్ల్స్‌ కాన్వెంట్రీల (194) పరుగుల రికార్డును అధిగమించాడు. ఇక అక్కడి నుంచి సచిన్‌ ఎప్పుడెప్పుడు 200 మార్కును చేరుకుంటాడా అని అంతా కళ్లప్పగించి చూశారు. స్టేడియంలోని ప్రేక్షకులు, గ్యాలరీలోని టీమ్‌ఇండియా క్రికెటర్లు మునివేళ్లపై నిల్చొని ఉన్నారు. టీవీల్లో ఆ మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకుల సంగతి చెప్పక్కర్లేదు. ఇక ధోనీ ఒకవైపు ధనాధన్‌ ఇన్నింగ్స్ ఆడుతుండగా.. సచిన్‌ మరోవైపు నెమ్మదిగా సింగిల్స్‌ తీస్తూ కనిపించాడు. దీంతో అతడు 200 మార్కును చేరుకుంటాడా లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. చివరికి చార్ల్‌ లాంగ్‌వెల్ట్‌ వేసిన 50వ ఓవర్‌ మూడో బంతిని సచిన్‌ (200 నాటౌట్‌; 147 బంతుల్లో 25x4, 3x6) పాయింట్‌ దిశగా ఆడి సింగిల్‌ తీశాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత ఈ మైలురాయిని ఎలా చేరుకోవాలో ఇతర బ్యాట్స్‌మెన్‌కు దిక్సూచిగా నిలిచాడు. దీంతో సచిన్‌, ధోనీ చివరి 54 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆఖరికి భారత్‌ 401 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆపై దక్షిణాఫ్రికా ఛేదనలో 248కే పరిమితమైంది. డివిలియర్స్‌ (114 నాటౌట్‌; 101 బంతుల్లో 13x4, 2x6) సెంచరీ చేసినా ఇతర బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులెత్తేశారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని