WTC Final: కోహ్లీ కన్నా రోహితే మెరుగైన కెప్టెన్‌

విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ కోల్పోయిన నేపథ్యంలో కెప్టెన్సీ విషయంపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. కోహ్లీ కన్నా రోహిత్‌ శర్మనే జట్టుకు సరైన నాయకుడని పలువురు అభిప్రాయపడుతున్నారు...

Updated : 27 Jun 2021 13:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ కోల్పోయిన నేపథ్యంలో కెప్టెన్సీ విషయంపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. కోహ్లీ కన్నా రోహిత్‌ శర్మనే జట్టుకు సరైన నాయకుడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సల్మాన్‌ బట్‌ కూడా తన యూట్యూబ్‌లో ఇవే వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా తనకు హిట్‌మ్యానే సరైన వ్యక్తని అనిపిస్తుందని చెప్పాడు.

‘విరాట్‌ కన్నా రోహితే మెరుగైన కెప్టెన్‌ అని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. 2018 ఆసియాకప్‌ సందర్భంగా రోహిత్‌లోని నాయకత్వ లక్షణాలను నిశితంగా గమనించాను. ఆ టోర్నీలో తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న అతడు చాలా సహజంగా జట్టును నడిపించినట్లు కనిపించాడు. విరాట్‌ విషయానికొస్తే టీమ్‌ఇండియా గత ఐదేళ్లుగా టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగింది. అయినా దురదృష్టంతో కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అలాంటప్పుడు ప్రజలు కూడా అతడి కెప్టెన్సీని ప్రశ్నిస్తారు. ఎంత మంచి కెప్టెన్‌ అయినా పెద్ద టోర్నీల్లో విజయం సాధించకపోతే ప్రజలు గుర్తించరు. అలాగే ఎంత మంచి కెప్టెన్‌కైనా అదృష్టం కలిసిరావాలి. మీ దగ్గర సరైన ప్రణాళికలు ఉన్నప్పుడు బౌలర్‌ తగిన విధంగా బౌలింగ్‌ చేయకపోతే ఉపయోగం లేదు. కొన్నిసార్లు కెప్టెన్‌ సరిగ్గా లేకున్నా.. ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపిస్తే కెప్టెన్‌పై ప్రభావం చూపదు. కానీ ప్రపంచానికి మాత్రం అత్యుత్తమ కెప్టెన్‌ అంటే పెద్ద టోర్నీలు సాధించడమే’ అని సల్మాన్‌ పేర్కొన్నాడు.

‘విరాట్‌ ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్‌ లేదా ఐపీఎల్‌ కూడా గెలవలేదు. అతడో టాప్‌క్లాస్‌ క్రికెటర్‌. దూకుడు కలిగిన ఆటగాడు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటాడు. మైదానంలో అడుగుపెడితే విజయం సాధించాలనే కసితోనే కనిపిస్తాడు. కానీ కెప్టెన్‌ అంటే ప్రశాంతంగా ఉండాలి. దూకుడుగా ఉండకూడదు. ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఇది అగ్నికి(కోహ్లీ), ఐస్‌ ముక్కకి (విలియమ్సన్‌) మధ్య పోటీ అని పలువురు అన్నారు. అయితే, ఇప్పటివరకు పెద్ద కప్పులు సాధించిన సారథుల్లో చాలా మంది ప్రశాంతంగా ఉండేవాళ్లే ఉన్నారు. కానీ, కోహ్లీ హావభావాలు దూకుడుగా ఉంటాయి. అతడు ఏదైనా పెద్ద ట్రోఫీ సాధించి ఉంటే కచ్చితంగా ప్రజలు కొనియాడేవారు’ అని సల్మాన్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని