Rohit Sharma: రోహిత్‌ శర్మది స్మార్ట్‌ కెప్టెన్సీ: పాక్‌ మాజీ సారథి

టీమ్‌ఇండియా నూతన పరిమిత ఓవర్ల సారథి రోహిత్‌ శర్మ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడని, అతడిది స్మార్ట్‌ కెప్టెన్సీ అని పాకిస్థాన్‌ మాజీ సారథి సల్మాన్‌ బట్‌ ప్రశంసించాడు...

Published : 11 Feb 2022 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా నూతన పరిమిత ఓవర్ల సారథి రోహిత్‌ శర్మ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడని, అతడిది స్మార్ట్‌ కెప్టెన్సీ అని పాకిస్థాన్‌ మాజీ సారథి సల్మాన్‌ బట్‌ ప్రశంసించాడు. ఇటీవల బీసీసీఐ విరాట్‌ కోహ్లీని వన్డే సారథిగా తప్పించడంతో రోహిత్‌ శర్మ ఆ బాధ్యతలను స్వీకరించాడు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటనకు అతడు వెళ్లకపోవడంతో కేఎల్‌ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. కానీ, టీమ్‌ఇండియా 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ చేపట్టగా ఇప్పటికే టీమ్‌ఇండియా రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అతడి నాయకత్వం బాగుందంటూ సల్మాన్‌ కితాబిచ్చాడు.

‘రోహిత్‌ శర్మది స్మార్ట్‌ కెప్టెన్సీ. అతడు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బౌలింగ్‌లోనూ పరిస్థితులను బట్టి మార్పులు చేస్తున్నాడు. ఫీల్డింగ్‌ సెట్‌ చేయడంలోనూ దూకుడుగా ఉంటున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌ల్లో గమనిస్తే.. క్యాచ్‌లు వచ్చే సరైన ప్రాంతాల్లోనే ఫీల్డర్లను పెడుతున్నాడు. ఇలా బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, మెరుగైన ఫీల్డింగ్‌ సెట్‌ చేయడం రెండూ కెప్టెన్‌కు కీలక విషయాలు. ఈ క్రెడిట్‌ అంతా కెప్టెన్‌గా రోహిత్‌కు దక్కుతుంది. దీంతో అతడు సారథిగా అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాడు’ అని సల్మాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా 44 పరుగులతో గెలిచింది. యువ క్రికెటర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌తో అదరగొట్టగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌తో రాణించాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ ఆటగాళ్లను వినియోగించుకోవడంలో విజయవంతమయ్యాడని పాక్ మాజీ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని