Virat Kohli : కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలనడం అర్థరహితం.. ప్రతి మ్యాచ్‌ ఆడితేనే ప్రయోజనం

దాదాపు రెండున్నరేళ్లుగా ఒక్క శతకం చేయలేదు.. అలాగని మరీ దారుణంగా ఆడుతున్నాడా అంటే అదేం లేదు. కాకపోతే అతడి స్థాయికి తగ్గ ఆట కాదని..

Published : 04 Aug 2022 12:25 IST

భువనేశ్వర్‌ కుమార్‌ ప్రయాణం అద్భుతమన్న సంజయ్‌ మంజ్రేకర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు రెండున్నరేళ్లుగా ఒక్క శతకం చేయలేదు.. అలాగని మరీ దారుణంగా ఆడుతున్నాడా..? అంటే అదేం లేదు. కాకపోతే అతడి స్థాయికి తగ్గ ఆట కాదని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇదెవరి గురించి అని కంగారు పడిపోకండి.. గత కొన్ని రోజులుగా అతడి ఫామ్‌పైనే చర్చ. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అతడే విరాట్ కోహ్లీ. 2019లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా శతకం చేశాడు. అయితే, అడపాదడపా అర్ధశతకాలు చేస్తున్నా కీలక సమయాల్లో వికెట్‌ కోల్పోతూ నిరాశపరిచాడు. తగినంత విశ్రాంతి లేకపోవడమే దానికి కారణమని పలువురు వాదిస్తుండగా.. అలాంటిదేమీ లేదని.. ప్రతి క్రికెటరూ ఇటువంటి దశను అనుభవిస్తారని మరికొందరు కొట్టిపడేశారు. ఈ క్రమంలో ఆసియా కప్‌, ప్రపంచకప్‌ జట్లలో విరాట్ కోహ్లీ తప్పకుండా ఉండాలని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్ స్పష్టం చేశాడు. అతడిని విశ్రాంతి పేరుతో ఆసియా కప్‌నకు ఎంపిక చేయకపోవడం తగదని పేర్కొన్నాడు. ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి తీసుకున్నాడని చెప్పాడు. 

‘‘ఇప్పటి నుంచి సాధ్యమైనంత వరకు విరాట్ కోహ్లీని ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడించాలి. కొంతమంది క్రికెట్‌కు విరామం తీసుకోవాలని చెబుతున్నారు. ఏ ఫార్మాట్‌ అయినా సరే విశ్రాంతి ఇవ్వడం తగదు. ఇప్పటికే అతడు తగినంత విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే గత రెండేళ్లు పరిశీలిస్తే కోహ్లీ అంతర్జాతీయస్థాయి మ్యాచ్‌లను పెద్దగా ఆడిందేమీ లేదు. అయినా, విండీస్‌తో సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం సరైంది కాదు. దీనిపై కోహ్లీతో సెలెక్షన్‌ కమిటీ మాట్లాడి ఉండొచ్చు. అందుకే మనకు తెలియని లాజిక్‌ ఏదైనా ఉందేమో చూడాలి. ఇక నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే కోహ్లీకి ప్రయోజనం’’ అని సంజయ్‌ మంజ్రేకర్ వివరించాడు.

గాయాల నుంచి కోలుకొని జాతీయ జట్టులోకి రావడం.. విజయవంతం కావడం చాలా కష్టమని సంజయ్‌ పేర్కొన్నాడు. అయితే, టీమ్‌ఇండియా మీడియం పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మాత్రం అద్భుతంగా పుంజుకొని కీలక బౌలర్‌గా మారడం ప్రశంసనీయమని చెప్పాడు. ‘‘ఇటీవల భువీ ఇంటర్వ్యూ చూశా. ‘ఎక్కువగా బౌలింగ్‌ వేశా. అందుకే నా రిథమ్‌ను అందిపుచ్చుకున్నా’ అని అందులో చెప్పాడు. అలానే ఇప్పుడు అతడి కెరీర్‌ ఉన్నత స్థాయిలో ఉంది. అయితే, 18 నెలల కిందట  భువనేశ్వర్‌ మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వస్తుందో... అలానే భువీ పునరాగమనం అద్భుతంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో ముఖ్య భూమిక పోషిస్తాడు’’ అని మంజ్రేకర్‌ తెలిపాడు. ఇతర ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువైనప్పుడు ఏం చేయాలనేదానిని భువనేశ్వర్‌ను చూసి నేర్చుకుంటే సరిపోతుందని సంజయ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని