INDvsSL: నా కెప్టెన్‌ గబ్బర్‌!

శ్రీలంకలో పర్యటించే భారత జట్టు సారథ్యం రేసులో శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఉంటారని టీమ్ఇండియా మాజీ..

Updated : 18 Oct 2022 16:50 IST

భువీ సైతం రేసులో ఉన్నాడన్న దీప్‌దాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకలో పర్యటించే భారత జట్టు సారథ్యం రేసులో శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఉంటారని టీమ్ఇండియా మాజీ ఆటగాడు దీప్‌దాస్‌ గుప్తా అన్నాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌కు భువీ ఎంపికవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నాడు. అతడు రెండున్నరేళ్లుగా టెస్టు క్రికెట్‌ ఆడలేదని వెల్లడించాడు.

తొలిసారి భారత్‌ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌, బుమ్రా, షమి సహా 20 మందితో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. తెల్లబంతి స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంకలో పర్యటిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించాడు.

‘విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్‌. కాబట్టి అతడు సారథ్యం రేసులో ఉంటాడు. కెప్టెన్‌గా ఎవరుంటారన్న సందేహం ప్రస్తుతం అందరిలోనూ ఉంది. నేనైతే ధావన్‌ అనుకుంటున్నా. భువనేశ్వర్‌ ఫిట్‌గా ఉండి ఆడేందుకు సిద్ధమైతే అతడూ మంచి అభ్యర్థే’ అని దీప్‌దాస్‌ అన్నాడు.

భువనేశ్వర్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికవ్వకపోవడంలో తనకేమీ ఆశ్చర్యం లేదని దీప్‌దాస్‌ గుప్తా చెప్పాడు. ‘ఆ సిరీస్‌కు ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఆ పరిస్థితులు, పిచ్‌లు భువీ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని తెలుసు. కానీ అతడు రెండు, రెండున్నరేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడలేదు. 2018 నుంచి ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతం అవుతున్నాడు. రంజీ క్రికెట్‌ సైతం ఆడలేదు. అతడి దేహం ఐదు రోజుల క్రికెట్‌ను భరిస్తుందో లేదో తెలియదు. శ్రీలంకను దృష్టిలో పెట్టుకొనే అతడిని ఎంపిక చేయలేదేమో’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని