Ravi shastri: భారత ఆటగాళ్లకు విదేశీ లీగ్‌లు అవసరం లేదు: రవిశాస్త్రి

దేశీయ క్రికెట్‌ ఉండగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లు ఆడాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి అన్నాడు. 

Published : 18 Nov 2022 12:46 IST

దిల్లీ: భారత ఆటగాళ్లకు విదేశీ లీగ్‌ల్లో అనుమతుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. టీమ్‌ఇండియాను వీటిలో ఆడనిస్తే అద్భుతంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం దేశీయ లీగ్‌లు జరుగుతున్న సమయంలో ఆటగాళ్లకు ఇందులో పాల్గొనే అవకాశమిస్తే నష్టపోయే అవకాశాలు మనకే  ఎక్కువని అంటున్నారు. ఇటీవల ఈ విషయంపై రాహుల్‌ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

 టీ20 ప్రపంచకప్‌ ఓటమిపై ద్రవిడ్‌ మాట్లాడుతూ... బిగ్‌బాష్‌ వంటి లీగ్‌ల్లో ఆడటం ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు కలిసొచ్చిందన్నాడు. అయితే,  రంజీ సీజన్‌ జరుగుతున్న సమయంలోనే వీటిని నిర్వహిస్తుండటం వల్ల వీటికి అనుమతిస్తే దేశవాళీ క్రికెట్‌ నాశనమవుతుందన్నాడు. తాజాగా ఈ అంశంపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దేశీయ క్రికెట్‌ ఉండగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లు ఆడాల్సిన అవసరం లేదన్నాడు. 

‘‘ఆటలో నైపుణ్యం సాధించేందుకు, కొత్త అవకాశాలను ఒడిసిపట్టేందుకు దేశీయ క్రికెట్‌ ఆటగాళ్లకు కావలసినన్ని అవకాశాలను ఇస్తుంది. ఇప్పటికే భారత- ఎ జట్టు పర్యటనలు చేస్తోంది. భవిష్యత్తులో రెండు భారత జట్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు టీమ్‌ఇండియా ఒకచోట ఆడితే ఇంకో జట్టు బయటకు వెళ్లి ఆడుతుంది. దేశీయ క్రికెట్‌, భారత టీ20 లీగ్‌, ఇతర పర్యటనల్లోనే వారికి కావలసినంత అనుభవం లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా విదేశీ లీగ్‌ల్లో ఆడటం వల్ల చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని