Neeraj Chopra: పతకాన్ని దిండు పక్కనే పెట్టుకొని నిద్రపోయా

నేను సాధించిన పతకాన్ని దిండు పక్కనే పెట్టుకొని నిద్రపోయా. ఇవి సంతోషకర క్షణాలు. నాపై ఏదో భారం ఉన్నట్లు అనిపించి కొద్దిరోజులుగా సరిగా నిద్రపట్టలేదు. కానీ రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయా....

Published : 08 Aug 2021 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశ వందేళ్ల కలను సాకారం చేస్తూ జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌ చరిత్రలోనే అథ్లెటిక్స్‌లో ఇప్పటివరకు ఒక్క పతకం లేని భారత్‌కు ఏకంగా బంగారు పతకాన్ని తెచ్చిపెట్టాడు. ఈ విజయం అనంతరం నీరజ్‌ చోప్రా ఆదివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గెలుపుతో తనపై ఉన్న ఓ పెద్ద బరువు దిగిపోయినట్లు పేర్కొన్నాడు. కొద్ది రోజులుగా సరిగా నిద్ర లేదని.. కానీ రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయినట్లు పేర్కొన్నాడు.

‘నేను సాధించిన పతకాన్ని దిండు పక్కనే పెట్టుకొని నిద్రపోయా. ఇవి సంతోషకర క్షణాలు. నాపై ఏదో భారం ఉన్నట్లు అనిపించి కొద్దిరోజులుగా సరిగా నిద్రపట్టలేదు. కానీ రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయా’ అని పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌ చరిత్రలోనే ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత జాతీయ గీతం మొదటిసారి వినిపించింది. దీనిపై నీరజ్‌ స్పందిస్తూ.. ఒలింపిక్స్‌ స్టేడియంలో భారత జాతీయ గీతం వినడం గొప్ప అనుభూతి అని, ఆ క్షణాలను మాటల్లో చెప్పలేనని పేర్కొన్నాడు. ఫీల్డ్‌లో తన ప్రదర్శన పట్ల మాట్లాడుతూ ‘మొదటి రెండు త్రోల్లోనే పతకం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. కానీ నా లక్ష్యం మాత్రం స్వర్ణం. దాని కోసం 100 శాతం కృషి చేశా. నా చివరి త్రోకు ముందే నేను స్వర్ణం సాధించానని తెలిసిపోయింది. ఎందుకంటే నాదే చివరి త్రో. స్వర్ణం గెలవడం మరిచిపోలేని అనుభూతి’ అని ఆనందం వ్యక్తం చేశాడు.

దేశ ప్రజల అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అగ్రస్థానంలో నిలిచి నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆఖరి ప్రదర్శనలో ఈటెను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్‌లో తొలి అవకాశంలోనే ఈటెను 87.03 మీటర్లు విసిరి నీరజ్ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మరింత మెరుగుపరుచుకొని 87.58 మీటర్లు విసిరి పతకం పోటీలో ముందుకెళ్లాడు. ఆరు రౌండ్లు ముగిసే సమయానికి పోటీలో పాల్గొన్న అథ్లెట్లలో అత్యధిక దూరం(87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని