Sreesanth: కోహ్లీ కెప్టెన్సీలో నేను ఆడి ఉంటే.. భారత్‌ 3 ప్రపంచకప్‌లు గెలిచేది: శ్రీశాంత్

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో అతడు ఆడి ఉంటే భారత్‌ కనీసం మరో మూడు ప్రపంచకప్‌లు గెలిచేదని చెప్పాడు...

Published : 19 Jul 2022 19:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో అతడు ఆడి ఉంటే భారత్‌ కనీసం మరో మూడు ప్రపంచకప్‌లు గెలిచేదని చెప్పాడు. తాజాగా క్రిక్‌చాట్‌ అనే కార్యక్రమంలో మాట్లాడిన ఈ కేరళ పేసర్‌ ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాక 2017లో కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే. అతడి నేతృత్వంలో భారత్‌ పలు ఐసీసీ టోర్నీల్లో ఆడింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌, 2021 టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2021 టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో ఆడింది. అయితే, ఎందులోనూ విజేతగా నిలవలేకపోయింది.

2017లో ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో, 2021 ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భంగపడింది. చివరికి 2021 టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశ నుంచే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సారథ్యంలో తాను ఆడి ఉంటే భారత్‌ కనీసం మూడు ట్రోఫీలు సాధించేదని శ్రీశాంత్‌ చెప్పాడు. అనంతరం 2011 వన్డే ప్రపంచకప్‌పై స్పందించిన మాజీ పేసర్‌.. అప్పుడు తాము సచిన్‌ కోసమే ప్రపంచకప్‌ గెలిచామని గుర్తు చేసుకున్నాడు. కాగా, శ్రీశాంత్‌.. ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2013లో భారత టీ20లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే 7 ఏళ్ల నిషేధం పూర్తిచేసుకొని గతేడాది తిరిగి దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇక ఈ ఏడాది భారత టీ20 లీగ్‌ వేలంలో పాల్గొన్నా ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. దీంతో శ్రీశాంత్‌ మార్చిలో ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని