Cricket News: మా జట్టులోనూ విజేతలున్నారన్న శనక.. హార్దిక్‌ భుజానెత్తుకోవడం బాగుందన్న బంగర్!

Published : 17 Sep 2023 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ ఫైనల్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు భారత స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కీలక బాధ్యతలను తీసుకోవడం అభినందనీయమని మాజీ కోచ్ సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌కు తేలిగ్గా విజయం దక్కదని పాక్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ పేర్కొన్నాడు. ఇలాంటి క్రికెట్‌ విశేషాలు మీ కోసం.. 

భారత్‌కే అక్కడ ఎక్కువ అవకాశాలు: శ్రీలంక కెప్టెన్

ఆసియాకప్‌ ముగిసిన ఇరవై రోజుల్లోనే వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్ వేదికగా మెగా సమరం జరగనున్న విషయం తెలిసిందే. తమ జట్టు అవకాశాలు ఎలా ఉంటాయనేదానిపై శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక మాట్లాడాడు. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్నట్లే.. వన్డే వరల్డ్‌ కప్‌లోనూ 2011 సీన్‌ రిపీట్‌ అవుతుందా...? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘‘మెగా టోర్నీలో ప్రతి జట్టుకు అవకాశాలు ఉంటాయి. అయితే, భారత్‌కు ఇంకాస్త మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే స్వదేశంలో ఆడటం వారికి అడ్వాంటేజ్‌. బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్‌లు ఉంటాయి. అలాగే స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం ఉంది. మా జట్టులోనూ అలాంటి టాప్ బౌలర్లు ఉన్నారు. ఒంటిచేత్తో విజేతగా నిలపగల సత్తా వారికి ఉంది. బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బలంగా ఉంది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే తప్పకుండా విజేతగా నిలుస్తాం’’ అని శనక తెలిపాడు. 


పాండ్య ఎంతో పరిణతి సాధించాడు: సంజయ్‌ బంగర్

హార్దిక్ పాండ్య ఈ ఆసియా కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడని, బాధ్యతలను భుజానెత్తుకోవడం అభినందనీయమని సంజయ్‌ బంగర్ వ్యాఖ్యానించాడు. ‘‘హార్దిక్ ఎంతో పరిణతి చెందాడు. కొంతకాలం ఫామ్‌, ఫిట్‌నెస్‌ విషయంలో ఇబ్బంది పడ్డాడు. అయితే, ఇప్పుడు మాత్రం ఫిట్‌నెస్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో తీవ్రంగా శ్రమించాడు. తన ఆల్‌రౌండ్‌ బాధ్యతలను భుజానికెత్తుకుని నిర్వర్తించడం బాగుంది. టీ20ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. జట్టులో సమతూకం తేవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుత భారత్‌ జట్టులో బౌలింగ్‌ ఎటాక్‌ అద్భుతంగా ఉంది. బుమ్రా, సిరాజ్, షమీతోపాటు కుల్‌దీప్‌ యాదవ్‌ వైవిధ్యంగా బంతులను సంధిస్తున్నారు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో అదరగొట్టేస్తున్నాడు’’ అని బంగర్ చెప్పాడు.


మ్యాచ్‌ రసవత్తరంగా ఉండటం ఖాయం: షోయబ్‌ అక్తర్

భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్‌ ఫైనల్‌ ఆసక్తికరంగా ఉండబోతుందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ‘‘ఆసియా కప్‌ సూపర్-4 దశలో బంగ్లాదేశ్‌పై భారత్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. అయితే, బంగ్లా అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. తప్పకుండా ఇది భారత్‌ను నిరుత్సాహానికి గురి చేస్తుంది. అలాగే శ్రీలంక చేతిలో పాక్‌ ఓడిపోవడం దారుణం. ఆసియా కప్‌ నుంచి నిష్క్రమించడం బాధించింది. ఇక ఫైనల్‌ గురించి మాట్లాడుకుంటే.. భారత్‌కు అంత సులువుగా విజయం లభిస్తుందని నేను భావించడం లేదు. శ్రీలంక పోరాట పటిమ కలిగిన జట్టు. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం రసవత్తరంగా ఉంటుంది’’ అని అక్తర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని